మాటిచ్చిన విజయ్- ఇక విజిల్ మోతలే
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.
మూడో ఏడాదిలోకి..
నేటితో మూడో ఏడాదిలోకి ప్రవేశించింది టీవీకే. ఎన్నికల సన్నాహాలు ముమ్మరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ఏడాది వేడుకలను ఘనంగా జరుపుకోనుంది. ఈ ఉదయం 11 గంటలకు విజయ్.. చెన్నై శివార్లలోని పనయూర్ లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఎన్నికల ప్రణాళికలపై ఈ ప్రసంగం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.

విజయ్ శుభాకాంక్షలు..
మూడో వ్యవస్థాపక దినోత్సాన్ని పురస్కరించుకుని విజయ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, రాజకీయ ప్రయాణం ఇప్పుడు పరిధులను దాటి మరింత విస్తరిస్తోందని అన్నారు. ప్రధాన రాజకీయ శక్తిగా రూపాంతరం చెందక ముందు, తాము ప్రజలతో మమేకం అయ్యామని ప్రజా ఉద్యమానికి చిహ్నంగా నిలిచామని గుర్తు చేశారు. కరూర్ తొక్కిసలాట ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు విజయ్. కొన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల్లో అపూర్వ ఆదరణ లభించిందని చెప్పారు.
విజయం సాధించడానికి కృషి..
అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో మునుపెన్నడూ లేని సరికొత్త పరిస్థితులు నెలకొన్నాయని విజయ్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వ్యూహాత్మకంగా కృషి చేస్తామని మాట ఇస్తున్నట్లు తెలిపారాయన. ప్రజల అండ, ఐక్యత, సంకల్ప బలంతో పాలనా పగ్గాలు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య లక్ష్య సాధనకు పార్టీ కట్టుబడి ఉందని, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. విజయం ఖాయమని పేర్కొన్నారు.
టీవీకే ప్రస్థానం..
నిజానికి- టీవీకే ప్రస్థానం సజావుగా సాగలేదు. కరూర్ తొక్కిసలాట ఉదంతం.. ఆ పార్టీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ఈ ఘటనలో 42 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అటు విజయ్ కీ చిక్కులు తెచ్చిపెట్టింది. సీబీఐ దర్యాప్తును ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ, ర్యాలీలో ఇంతమంది మరణించడం అనేది చాలా అరుదు.
'విజిల్' మోత..
ఈ ఎన్నికల్లో టీవీకేకు 'విజిల్' గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో ఇదే టైటిల్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీని తెరకెక్కించారు విజయ్. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే మూవీ టైటిల్.. ఇప్పుడు విజయ్ స్థాపించిన టీవీకేకు దక్కింది. దీంతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. విజిల్ తో సందడి చేయడం మొదలు పెట్టారప్పుడే.












Click it and Unblock the Notifications