అసమగ్ర బిల్లుకు వ్యతిరేకమే: బాబుకు ఉద్ధవ్ హామీ
ముంబై: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి హామీ ఇచ్చారు. చంద్రబాబుతో భేటీ తర్వాత థాకరే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అసమగ్రంగా ఉన్న బిల్లుకు పార్లమెంటులో తమ ఆమోదం ఉండదని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాకరేతో భేటీ తర్వాత చంద్రబాబు తిరిగి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతను కూడా కలిసే అవకాశాలున్నాయి.

సిఎం దీక్ష డ్రామా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన దీక్షను బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో పబ్బం గడుపుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకుంటే ముఖ్యమంత్రిని తొలగించే అవకాశం ఉందని, అయినా అలా చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డిని ఆడిస్తున్నారని ఆయన అన్నారు.
రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ పార్లమెంటులో వ్యవహరిస్తుందని ఇతర పార్టీలు చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన అన్నారు. పార్లమెంటులో తమ పార్టీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications