UDF ప్రభంజనం.. సై అంటే సై
కేరళలో ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ హవా కొనసాగుతోంది. అనేక చోట్ల ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ లల్లో యూడీఎఫ్ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తోన్నారు. వామపక్షాల నాయకత్వంలోని అధికార ఎల్డీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ ఒకట్రెండు చోట్ల ఖాతా తెరిచింది.
కేరళలో ఉన్న మొత్తం 86 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు ఇటీవలే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. వాటి లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. ప్రారంభం నుంచే యూడీఎఫ్ ప్రభంజనం కనిపించింది. తిరువనంతపురం సహా రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ ఉదయం 11 వరకు అందిన సమాచారం ప్రకారం.. యూడీఎఫ్ 53 చోట్ల తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ఎల్డీఎఫ్ 30 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది.

మున్సిపల్ కార్పొరేషన్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆరింట్లో నాలుగు చోట్ల యూడీఎఫ్ అభ్యర్థులు మెజారిటీని సాధించారు. ఎల్డీఎఫ్, బీజేపీ ఒక్కో స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో ఈ పోరు హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్, ఈవీఎం ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తున్నారు. యూడీఎఫ్ నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల సంబరాలు చేసుకుంటోన్నారు. కీలకమైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముట్టాడ వార్డులో యూడీఎఫ్ అభ్యర్థిని వైష్ణా సురేష్ ఘన విజయం సాధించారు.
మనంథవాడి, మావళ్లిక్కార, కోచి, కోజికోడ్, అళప్పుజ, కట్టప్పాన, పట్టాంబి, ఒంచియామ్ వంటి మున్సిపాలిటీలను యూడీఎఫ్ గెలుచుకుంది. ఒంచియామ్ లో యూడీఎఫ్ భాగస్వామి రివాల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పాలక్కాడ్, చెర్పుల్లాస్సేరి, కల్పెట్ట, వంటి మున్సిపాలిటీల్లో ఎల్డీఎఫ్ మెజారిటీ వార్డులను గెలుచుకుంది. కీలక మున్సిపాలిటీల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధిస్తోండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్డీఎఫ్ ముందంజలో ఉంటోంది.












Click it and Unblock the Notifications