‘పడుకున్న పులిని లేపొద్దు’: వైగో, హిందీపై జయ లేఖ
చెన్నై: హిందీ భాషను సోషల్ మీడియాలో అధికారులు ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల తమిళ పార్టీలతోపాటు పలు రాజకీయ పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో ప్రభుత్వ అధికారులు హిందీ భాషను అధికారికంగా ఉపయోగించాలని కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో వివిధ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారిక భాష నియమాలకు విరుద్ధంగా ఉందని ఆ లేఖలో తెలిపారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారులు ఇంగ్లీష్ భాషనే ఉపయోగించుకునేలా సూచనలు ఇవ్వాలని ఆమె తన లేఖలో ప్రధానిని కోరారు. కరుణానిధి కూడా హిందీ భాషను సోషల్ మీడియాలో ఉపయోగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకంచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా తమ అధికారిక భాషలు ఇంగ్లీష్, ఉర్దూ ఎక్కడా? అని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలుపుతున్న పార్టీలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలికిన రెండు పార్టీలు కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని పిఎంకె అధ్యక్షుడు రామదాస్ తేల్చి చెప్పారు. మరో తమిళ పార్టీ ఎండిఎంకె నేత వి గోపాలస్వామి(వైగో) ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. పడుకున్న పులిని నిద్ర లేపొద్దని హెచ్చరించారు. హిందీని తప్పనిసరి అమలు చేయడం దేశ సమగ్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. 1960ల్లోనే తమిళ పార్టీలు, ప్రజలు హిందీ భాషను ఏకైక అధికారిక భాషగా ప్రకటించడాన్ని వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించారు.
కాగా, హిందీ భాష అమలుపై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని అన్ని భాషలు ప్రభుత్వానికి ముఖ్యమేనని తెలిపారు. అన్ని భాషలను ప్రమోట్ చేస్తామని చెప్పారు. హిందీ భాషను సోషల్ మీడియాలో ప్రవేశపెట్టాలని చూశామని, అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications