సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై మరింత జుగుప్స కలిగించేలా అలాంటి ఫొటోలు ప్రింట్:
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల కొన్ని సత్ఫలితాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణం మెరుగుపడిందని, ప్రజల్లో శుభ్రత పట్ల అవగాహన కలగడానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ పడిందనే నిర్ణయానికి వచ్చింది. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులను ధరించడం, శానిటైజర్లను వినియోగించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చంటూ చేస్తోన్న ప్రచారం.. లక్ష్యాన్ని చేరుకుందనే భావన కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోంది.

పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నియంత్రణ..
ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే సంకేతాన్ని పంపించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే భారీగా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందనీ హెచ్చరించాయి. ఇక- అదే ఊపుతో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికోసం కొన్ని మార్పులను సైతం చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై జుగుప్సాకరమైన ఫొటోలు..
ఇందులో భాగంగా- సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్యాకెట్లపై జుగుప్సాకరమైన ఫొటోలను ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సిగరెట్, గుట్కా పాకెట్లపై ఇప్పుడున్న ఫొటోలకు బదులుగా కొత్తవాటిని ముద్రించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఆ ఫొటోలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెండు వేర్వేరు ఫొటోలను జారీ చేసింది. ఇప్పుడు కూడా సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై నోటి కేన్సర్‌కు సంబంధించిన ఫొటోలను ముద్రించి ఉన్నప్పటికీ.. ఈ సారి వాటి సైజును పెంచబోతోంది.

కొత్త ప్యాకెట్ల ముద్రణ సెప్టెంబర్ నుంచి
ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త ఫొటోలు సిగరెట్ ప్యాకెట్లపై ముద్రిస్తారు. 12 నెలల పాటు సిగరెట్, బీడీ, గుట్కా ప్యాకెట్లపై ఆ ఫొటోలు కొనసాగుతాయి. అనంతరం వచ్చే ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరో రెండు కొత్త ఫొటోలను ముద్రించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ముద్రించబోయే ఫొటోలను కూడా కేంద్రం సోమవారమే విడుదల చేసింది. ఫొటోలతో పాటు ఆరోగ్యపరమైన హెచ్చికలను తప్పనిసరిగా వాటిపై ముద్రించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications