ఢిల్లీలో కేంద్రమంత్రి వర్సెస్ టీఎంసీ ఎంపీలు-రెండున్నర గంటలు వేచి చూశా- అన్నీ అబద్దాలే..
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రికీ, టీఎంసీ ఎంపీలకు మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్ని విడుదల చేయడం లేదంటూ టీఎంసీ ఎంపీలు నిరసనకు దిగారు. గంటల తరబడి నిరసన చేసిన తర్వాత కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కలిసేందుకు వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే వారు వచ్చే వరకూ ఆగి వచ్చాక ఆమె వెళ్లిపోవడంతో టీఎంసీ ఎంపీలు మండిపడ్డారు. ఆమెను అబద్ధాల కోరుగా అభివర్ణించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద నిధులు విడుదల చేయాలనే డిమాండ్ తో దేశ రాజధానిలో సోమవారం నుండి నిరనసలు చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యేలు నిన్న సాయంత్రం 6 గంటలకు కృషి భవన్‌లో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితో సమావేశం కావాలని నిర్ణయించి సమాచారం ఇచ్చారు. కానీ వారు వచ్చే సమయానికి ఆమె వెళ్లిపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి నిరసన తెలుపుతున్న ఎంపీలు తనను కలవడానికి రాలేదని, దాదాపు రెండున్నర గంటల సమయం వృధా చేశారని పేర్కొన్నారు.

కేంద్రమంత్రి సాధ్వి ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఘాటుగా స్పందించారు. ఆమె అబద్ధాల కోరుగా అభివర్ణించారు. మంత్రి తమను మూడు గంటలు వేచి ఉండేలా చేసి, ఆపై వెనుక తలుపు ద్వారా పరుగు తీశారని మోయిత్రా ఆరోపించారు. "క్షమించండి, సాధ్వి నిరంజన్ జ్యోతి, మీరు చాలా అబద్ధాలు చెబుతారు. మీరు మా ప్రతినిధి బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మీరు అన్ని పేర్లను పరిశీలించారు. మమ్మల్ని ప్రవేశించడానికి అనుమతించే ముందు ఒక్కొక్కరిని తనిఖీ చేశారు. మమ్మల్ని 3 గంటలు వేచి ఉండేలా చేసి ఆపై వెనుక డోర్ ద్వారా పారిపోయారన్నారు.

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన తర్వాత కూడా జ్యోతి తమను కలవలేదని ఆరోపించారు. తాము సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిని కలవాలని నిర్ణయించుకున్నామని, తాము 90 నిమిషాలు వేచి ఉన్నామని తెలిపారు. ఆ తర్వాత ఆమె మమ్మల్ని కలవడం సాధ్యం కాదని సమాచారం ఇచ్చారన్నారు. సాధ్వి నిరంజన్ సాయంత్రం 4 గంటలకు బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారని, కానీ తమను కలవలేదని, ఆమెకు తమను కలవడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications