కేరళ స్టోరీ సినిమా చూడబోతున్న యూపీ కేబినెట్-మంత్రులతో కలిసి వీక్షించనున్న యోగీ..
కేరళ నుంచి మతం మార్చుకుని వెళ్లిపోయి ఐసిస్ లో చేరిన యువతుల గాథతో తెరకెక్కిన ది కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో పలు బీజేపీ రాష్ట్రాలు ఆ సినిమాను తమ రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్నాయి. యూపీతో పాటు పలు రాష్ట్రాలు ఇదే క్రమంలో కేరళ స్టోరీకి వినోద పన్ను మినహాయింపు కుడా ఇచ్చేశాయి. అంతేకాదు బీజేపీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ సినిమాను ప్రత్యక్షంగా చూస్తున్నారు.
కేరళ స్టోరీ చిత్రానికి ముందు నుంచీ మద్దతుగా నిలుస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఈ చిత్రానికి వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో నిన్న చిత్ర యూనిట్ సభ్యులు యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని యోగీ అభినందించారు. అదే సమయంలో తమ చిత్రం ప్రత్యేక షో చూడాలని యోగీని వారు కోరారు. దీనికి యోగీ ఆదిత్యనాథ్ అంగీకరించారు.

ఈ నేపథ్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ఆయన కేబినెట్ మంత్రులందరూ కలిసి ఇవాళ లోక్ భవన్ లో కేరళ స్టోరీ చిత్రాన్ని వీక్షించబోతున్నారు. ఇందుకోసం చిత్ర నిర్మాతలతో కలిసి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. లోక్ భవన్ లో సాయంత్రం ఈ ప్రత్యేక షోను వీరంతా కలిసి చూడబోతున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, బీజేపీ నేతలు అంతా కలిసి 600 మంది ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు.
నిన్న యోగీ ఆదిత్యనాథ్ ను కలిసిన కేరళ స్టోరీ చిత్ర నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, అదా శర్మ, ఇతర నటీనటులు యూపీ సర్కార్ సహకారంపై ధన్యవాదాలు తెలిపారు. యూపీ ప్రజలకు ఈ చిత్రం చూసేందుకు అవకాశమిచ్చిన యోగీకి దర్శకుడు సుదీప్తో సేన్ కృతజ్ఞతలు తెలిపారు. తమ చిత్రానికి వినోద పన్ను మినహాయిస్తూ యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ మానసిక స్ధైర్యం మరింత పెంచిందని కేరళ స్టోరీ చిత్ర నిర్మాత విపుల్ షా తెలిపారు. తమ చిత్రం చూడాల్సిందిగా ప్రేక్షకులకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ బలమైన సందేశం పంపారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెపుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications