ఇద్దరు పిల్లలకు మించివుంటే అన్నీ కోతలే: కొత్త పాపులేషన్ పాలసీని ఆవిష్కరించిన యోగి ఆదిత్యనాథ్
లక్నో: జనాభా పెరుగుదల సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణకు రూపొందించిన నూతన విధాన వివరాలను ఆయన వెల్లడించారు. యూపీ లా కమిషన్ రూపొందించిన జనాభా బిల్లు ముసాయిదా వివరాలను ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం విడుదల చేశారు.

2026 నాటికి 2.1 శాతానికి జననాల రేటు తగ్గింపే టార్గెట్
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026 నాటికి రాష్ట్రంలో జనన రేటును ప్రతి వెయ్యి జనాభాకు 2.1 శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం యోగి తెలిపారు. ప్రస్తుతం 2.7 శాతంగా ఉన్న జననరేటును 2030 నాటికి 1.9 శాతానికి తగ్గించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
జనాభా పెరుగుదల విపరీతంగా పెరగడం వల్ల రాష్ట్రంతోపాటు దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని యోగి అభిప్రాయపడ్డారు. అంతేగాక, పేదరికం పెరగడానికి కూడా జనాభా పెరుగుదల కారణమవుతోందన్నారు. నూతన జనాభా విధానం కోసం 2018 నుంచి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు..
రాష్ట్రంలో జనాభా నియంత్రణ చేపట్టాలంటే ఇద్దరు సంతానం మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని సీఎం యోగి సూచించారు. కాగా, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశే కావడం గమనార్హం. యూపీ దాదాపు 24 కోట్లకుపైగా జనాభా కలిగివుంది. ఈ క్రమంలో జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లల నిబంధన తీసుకురానుంది.
ఈ మేరకు రాష్ట్ర లా కమిషన్.. ముసాయిదా యూపీ జనాభా బిల్లు-2021ను తయారు చేసింది. ఇది చట్ట రూపంలోకి వస్తే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే.. ప్రమోషన్లూ ఉండవు
అంతేగకా, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనర్హులే. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి భవిష్యత్‌లో ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ప్రభుత్వం నుంచి పథకాలు పొందడానికి కూడా వీలుండదు. ఇద్దరు పిల్లల నిబంధనలు పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ప్రోత్సాహకాలు అందజేయనున్నారు.
ఇక కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. రేషన్ కార్డులో నలుగురే ఉండేలా ప్రతిపాదిన చేశారు. దీనిపై ప్రస్తుతం ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. కాగా, ఆగస్టు రెండో వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, సహా పలు రాజకీయ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యరేకతిస్తున్నాయి.












Click it and Unblock the Notifications