UP polls: 4వ దశ ఎన్నికల పోలింగ్, 59 అసెంబ్లీ స్థానాల్లో 624 మంది పోటీ, ప్రముఖులు వీరే
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాల్గవ దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిలిబిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా ఫతేపూర్ జిల్లాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇటీవల లఖీంపూర్ ఖేరీలో సంచలనం సృష్టించిన రైతులపై కారు దాడి ఘటన ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Recommended Video
ఈ 58 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో 51 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. నాలుగు స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, మూడు చోట్ల బహుజన్ సమాజ్ వాదీ పార్టీ గెలిచాయి. అప్నా దళ్ ఒక స్థానం గెలుపొందింది. అయితే, ఈసారి మాత్రం వివిధ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

లక్న కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ పాఠక్ పోటీలో ఉన్నారు. అంతకుముందు ఆయన లక్నో సెంట్రల్ నుంచి గెలుపొందారు. లక్నో తూర్పు స్థానం నుంచి మరో మంత్రి ఆశుతోష్ టాండన్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ భదౌరియా పోటీలో ఉన్నారు.
ఇక లక్నో జిల్లా సరోజినీ నగర్ స్థానం నుంచి బీజేపీ తరపున ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎస్పీకి చెందిన మాజీ మంత్రి అభిషేక్ మిశ్రా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉంటూ వస్తున్న రాయ్‌బరేలీ కూడా ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అదితీ సింగ్ ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈసారి బీజేపీ అభ్యర్థిగా అదితీ సింగ్ పోటీ చేస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. నేటి సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.












Click it and Unblock the Notifications