రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది, షరియా ప్రకారం కాదు: ‘80-20’పై యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 300లకుపైగా స్థానాలు సాధిస్తుందని యోగి ధీమా వ్యక్తం చేశారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు యోగి ఆదిత్యనాథ్.

80 శాతం మంది బీజేపీతోనే ఉన్నారు: 80-20పై యోగి ఆదిత్యనాథ్
యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఎన్నికలు 80 వర్సెస్ 20 మధ్య జరిగే పోరు అని, ఇందులో 80 శాతం మంది ప్రగతిని వెనుకేసుకొచ్చే వారని, 20 శాతం మంది ప్రజలు ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతికూల వైఖరితో ఉన్నారని అన్నారు. అందుకే బీజేపీకి 300కుపైగా సీట్లు వస్తాయన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ముగిసిన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందేహం లేదని ఆదిత్యనాథ్ అన్నారు.
'ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, ప్రజల ఆశీర్వాదంతో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తిరిగి రాబోతోంది. ఎన్నికలు 80 వర్సెస్ 20 దిశను తీసుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ కలత చెందాయి. మొదటి దశ తర్వాత వెనుకంజలో ఉన్నాయి' అని యోగి వ్యాఖ్యానించారు. వివాదాన్ని సృష్టించిన తన 80 వర్సెస్ 20 వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. యోగి ఆదిత్యనాథ్ ఇలా అన్నారు, 'ఇది చర్యకు ప్రతిస్పందన. 80% మంది ప్రజలు బీజేపీతో ఉన్నారు, 20% మంది ఎల్లప్పుడూ మమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఈసారి కూడా అలా చేస్తారని నేను చెప్పాను. మతం లేదా కులం నేపథ్యంలో తాను చెప్పడం లేదన్నారు. 80% మంది భద్రత, అభివృద్ధి ప్రభుత్వ ఎజెండాతో సంతోషంగా ఉన్నారు' అని యోగి తెలిపారు.

20శాతం మంది ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తారు: యోగి ఆదిత్యనాథ్
'20 శాతం మంది ఎప్పుడూ ప్రతిదానిని వ్యతిరేకించే వ్యక్తులు. వారు ఇంతకు ముందు ప్రతిదానిని వ్యతిరేకించారు. ఇప్పుడు అలాగే కొనసాగుతున్నారు. వారు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉన్నారు. వారు డబ్బు, నేరాల వెనుకే ఉంటారు. అలాగే కొనసాగుతారు. ఈ ఎన్నికలు 80 వర్సెస్ 20 అన్నట్లు ఉంటాయి' యోగి పేర్కొన్నారు. మొదటి దశ ఎన్నికల తర్వాత, ఇది నిజంగా 80 వర్సెస్ 20 పోల్ అని స్పష్టమవుతోందని ఆదిత్యనాథ్ అన్నారు.
"80 శాతం మంది ప్రజలు బిజెపికి మద్దతు ఇచ్చారు, 20 శాతం మంది వ్యతిరేకించాలనుకుంటున్నారు. (వారు) వ్యాక్సిన్ (COVID), అన్న యోజన, ఎక్స్‌ప్రెస్‌వేలు, వన్ డిస్ట్రిక్ట్ వన్ మెడికల్ కాలేజ్ ప్లాన్‌ను వ్యతిరేకించారు, వారు ప్రతిదానిని వ్యతిరేకించారు అని మండిపడ్డారు.
రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది.. షరియా చట్టం ప్రకారం కాదు: యోగి
మతోన్మాదులపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం మాట్లాడుతూ.. తమ గజ్వా-ఇ-హింద్ కల 'ఖయామత్' వరకు నెరవేరదని, ప్రభుత్వం షరియత్ చట్టం ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని స్పష్టం చేశారు.ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, CM ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఇది కొత్త భారతదేశం, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఈ కొత్త భారతదేశంలో అభివృద్ధి అందరికీ ఉంటుంది. ఎవరినీ శాంతింపజేయడం ఉండదు' అని స్పష్టం చేశారు.
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇది సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సూత్రంతో పనిచేస్తుంది. కొత్త భారతదేశం షరియత్ ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారమే పని చేస్తుందని, గజ్వా-ఏ-హింద్ కల ఖయామత్ వరకు కూడా నెరవేరదని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను' అని యోగి అన్నారు. 'గజ్వా-ఏ-హింద్ కావాలని కలలు కనేవాళ్లు, తాలిబానీ మత ఛాందసవాదులు దీన్ని అర్థం చేసుకోండి... భారతదేశం షరియత్ ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది...!' అని సీఎం యోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కర్ణాటక హిజాబ్ అంశంపై యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారంటే..?
కర్నాటకలో హిజాబ్‌పై దేశంలో తాజా దుమారం రేగడంతో, ఆదిత్యనాథ్ తన వైఖరిని స్పష్టం చేశారు. పాఠశాలల్లో సరైన డ్రెస్‌కోడ్‌ను అనుసరించాలని, యూపీలోని ప్రజలను లేదా కార్మికులను కాషాయం ధరించమని తాను ఎప్పుడూ అడగలేదని అన్నారు. ఏది ధరించాలో వారి వ్యక్తిగత ఎంపిక అని తెలిపారు.
"భారత రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడపాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. మన వ్యక్తిగత విశ్వాసాలు, మన ప్రాథమిక హక్కులు, మన వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలను దేశం లేదా సంస్థలపై విధించలేము. నేను యూపీలోని ప్రజలను, కార్మికులను కాషాయ దుస్తులు ధరించమని అడుగుతున్నానా? ఏది వేసుకోవాలనేది వారి ఇష్టం.. అయితే స్కూల్స్‌లో డ్రెస్ కోడ్ ఉండాలి.. ఇది స్కూల్స్ విషయం.. స్కూల్స్‌లో క్రమశిక్షణ అవసరం అని వ్యాఖ్యానించారు యోగి ఆదిత్యనాథ్. ఒకరి వ్యక్తిగత విశ్వాసం వేరు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు, "కానీ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు, అక్కడ నిబంధనలను అంగీకరించాలి, జాతీయ సందర్భంలో, రాజ్యాంగాన్ని అనుసరించాలి అని స్పష్టం చేశారు.
'యూపీ.. బెంగాల్, కేరళగా మారవచ్చు' : అక్కడ అరాచకాలంటూ యోగి
బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్, కేరళలా మారుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. సోమవారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
'ఈ వ్యక్తులు బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారు, దీని కోసం, దీనికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది, 'అలర్ట్‌గా ఉండండి - ప్రజలకు లభిస్తున్న భద్రత, గౌరవం, దానిని అడ్డుకోవడానికి కొందరు వచ్చారు, అలా జరగనివ్వవద్దు. 'ప్రజలను అప్రమత్తం చేయడం నా బాధ్యత' అని ఆదిత్యనాథ్ అన్నారు.
గత ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలను హైలైట్ చేస్తూ.. ఆదిత్యనాథ్ మాట్లాడారు. "నేను అడగాలనుకుంటున్నాను, బెంగాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా? ఇటీవల, బెంగాల్‌లో విధానసభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ కార్యకర్తలను హింసించారు. బూత్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనేక మంది వ్యక్తులు మరణించారు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన హింస, రాజకీయ హత్యలు ఇంకా ఎక్కడ జరిగాయి?' అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.
భారతదేశంలో రాజకీయాల ఎజెండాను ప్రధాని మోడీ మార్చారు: సీఎం యోగి
"భారతదేశంలో రాజకీయాల ఎజెండాను మార్చినందుకు" ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. "కుల, మత, కుటుంబ రాజకీయాల స్థానంలో అభివృద్ధి, సుపరిపాలన, గ్రామాల అభివృద్ధి, పేదలు, రైతులు, యువత, మహిళలు వచ్చారు. 'ప్రధాని మోడీ విజన్ కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. ఎన్నికల మానిఫెస్టో మా తీర్మానాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది ప్రజల పట్ల బీజేపీకి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తోంది. అభివృద్ధి, విశ్వాసం, సంక్షేమంపై ఆధారపడిన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పేదల కోసం, మేము ఇంతకు ముందు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము, "అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కాగా, రాష్ట్ర అసెంబ్లీకి నేడు రెండో దశ పోలింగ్ జరుగుతోంది. సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బుదౌన్, షాజహాన్‌పూర్‌లోని తొమ్మిది జిల్లాల పరిధిలో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications