యూపీ ఎన్నికల్లో కీలకంగా సోషల్ మీడియా: ట్విట్టర్‌లో యోగి ఆదిత్యనాథ్ టాప్, ఎఫ్‌బీలో అఖిలేష్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 403 స్థానాలకు గాను 172 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ పూర్తయింది. అన్ని స్థానాలకు సంబంధించిన ఓటింగ్ మార్చి 7న ముగిసి, మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తోంది.

యూపీ ఎన్నికల్లో కీలకంగా మారిన సోషల్ మీడియా
అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ర్యాలీలు, రోడ్‌షోలలో తమ ప్రసంగాలను నేరుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రసారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లకు తమ సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి వారు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. దీంతో యూపీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో అనేక మంది సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ఫాలోవర్లలో టాప్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన పెద్ద నేతలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అనుసరించే వారి సంఖ్య గత కొద్దిరోజులుగా పెరగడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పోలిస్తే ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోవర్లు
ఉన్నారు.

యోగి తర్వాత అఖిలేష్ యాదవ్‌కే ట్విట్టర్ ఫాలోవర్లు ఎక్కువ
కాగా, జనవరి 1, 2022న, యోగి ఆదిత్యనాథ్‌కు ట్విట్టర్‌లో 1,73,79,413 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఫిబ్రవరి 20 నాటికి అది 1,77, 13, 658కి పెరిగింది. కేవలం 51 రోజుల్లో, యోగి ట్విట్టర్ ఫాలోవర్లు 3,34, 245 పెరిగారు. అంటే.. ప్రతిరోజూ 6,550 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు పెరిగారు. జనవరి 1, 2022న, సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత నాయకుడు అఖిలేష్ యాదవ్‌కు ట్విట్టర్‌లో 1, 39,0,422 మంది ఫాలోవర్లు ఉన్నారు. 20 ఫిబ్రవరి 2022న ఫాలోవర్ల సంఖ్య 1, 59, 4, 422కి పెరిగింది. కేవలం 51 రోజులలో, అఖిలేష్ యాదవ్ 2,04,000 ట్విట్టర్ ఫాలోవర్లను జోడించారు. అంటే.. దాదాపు 4000 మంది ఫాలోవర్లు ప్రతిరోజూ పెరిగారు.

ప్రియాంక గాంధీ, మాయావతి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఎంతంటే?
జనవరి 1, 2022న, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ట్విట్టర్‌లో 45, 14, 516 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఇది ఫిబ్రవరి 20, 2022 నాటికి 46,00,373కి పెరిగింది. 51 రోజుల్లో మొత్తం 85,857 ట్విట్టర్ ఫాలోవర్లు పెరిగారు - రోజుకు దాదాపు 1,600 మంది ఫాలోవర్లు పెరిగారు. జనవరి 1, 2022న, బీఎస్పీ అధినేత్రి మాయావతికి Twitterలో 24, 31, 677 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఇది ఫిబ్రవరి 20, 2022 నాటికి 25,01,016కి పెరిగింది. 51 రోజుల్లో, మాయావతి 69,339 మంది అనుచరులను జోడించారు - ప్రతిరోజూ దాదాపు 1296 మంది అనుచరులు పెరుగుతున్నారు.
Recommended Video

ఫేస్‌బుక్‌లో యోగి కంటే అఖిలేష్ ఫాలోవర్ల సంఖ్యే ఎక్కువ
ఫేస్‌బుక్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు 60 లక్షల మందికి పైగా, అఖిలేష్‌కు 70 లక్షలకు పైగా, ప్రియాంక గాంధీకి 40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా, మాయావతికి Facebookలో అధికారికంగా ధృవీకరించబడిన పేజీ లేదు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడవ దశ పోలింగ్ ఫిబ్రవరి 20న ముగిసింది, దాదాపు 63% ఓటింగ్ నమోదైంది. మిగిలిన దశల ఎన్నికలు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.












Click it and Unblock the Notifications