పూజా ఖేడ్కర్‌కు భారీ షాక్: యూపీఎస్సీ బ్యాన్, అభ్యర్థిత్వం రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ (Puja Khedkar)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై అవినీతి ఆరోపణల వ్యవహారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సంచలన నిర్ణయం తీసుకుంది. పూజ ఖేడ్కర్ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక, భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ అధికారులు తెలిపారు.
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ పూజా ఖేడ్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అయితే, దీనికి పూజ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు యూపీఎస్సీ తాజా ప్రకటనలో వెల్లడించింది. పూజా ఖేడ్కర్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్(CSE) 2022 నియమాలను ఉల్లంఘించినట్టు తేలిందని వివరించింది. ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై జులై 18న పూజా ఖేడ్కర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోగా దీనిపై సమాధానం చెప్పాలని పూజను ఆదేశించింది. దీనిపై స్పందించిన ఆమె.. ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పూజ విజ్ఞప్తిని పరిశీలించిన యూపీఎస్సీ.. జులై 30 మధ్యాహ్నం 3.30 గంటల వరకు అనుమతించింది. అయితే, ఆమెకు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సమయంలోగా సరైన స్పందన రాకపోవడంతో తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఇప్పటికే పూజా ఖేడ్కర్ వ్యవహారంపై యూపీఎస్సీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పుణెలో శిక్షణలో ఉండగా పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపై యూపీఎస్సీ దర్యాప్తు చేసింది. పూజ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించింది.
మరోవైపు, 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2007లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. పూజ నాన్ క్రీమీలేయర్, వైద్య ధ్రువీకరణలు కూడా వివాదాస్పదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తును చేపట్టింది. ఇది ఇలావుంటే, చీటింగ్ ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ముందస్తు బెయిల్ కోసం పూజ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 1వ తేదీన కోర్టు తీర్పు వెలువరించనుంది.












Click it and Unblock the Notifications