యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా: సన్యాసం స్వీకరించే యోచన
UPSC Chairman Manoj Soni: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ.. తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి అయిదు సంవత్సరాలకు ముందే ఈ అత్యున్నత హోదా నుంచి తప్పుకొన్నారు. స్వచ్ఛందంగా ఆయన వైదొలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సహా పలు కీలక పరీక్షల్లో గందరగోళం నెలకొంది. చాలామటుకు రద్దయ్యాయి. వాయిదా పడ్డాయి.

మరోవైపు ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారం రోజురోజుకూ దుమారం రేపుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయానా ఆమెపై కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక ముందు ఆమె సివిల్స్ రాయకుండా డిబార్ చేయాలని ఆదేశించింది. ఆమెకు షోకాజ్ నోటీసులను సైతం అందజేసింది.
ఈ పరిస్థితుల్లో మనోజ్ సోనీ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. 2029 వరకు ఆయన యూపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. అయిదేళ్ల ముందే తప్పుకున్నారు. గతంలో యూపీఎస్సీ సభ్యుడిగా కొనసాగారు. 2023లో ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు.
మనోజ్ సోని రాజీనామాకు ఈ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల నెల కిందటే ఆయన వైదొలిగారని అంటున్నారు. రాజీనామా చేసిన విషయంలో ఆలస్యంగా వెలుగులోకి రావడం ఆసక్తి కలిగిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది మనోజ్ సోనికి. 2005లో వడోదరలోని ప్రఖ్యాత మహారాజా సయ్యాజీ రావు యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఎంపిక అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 40 సంవత్సరాలే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛైర్మన్‌గా రికార్డు సృష్టించారు.
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. స్వామినారాయణ్ బోధనలను అనుసరిస్తూ అనుపమ్ మిషన్ ద్వారా నిష్కామ యోగిగా మారాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications