కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వీఏ నాగేశ్వరన్ నియామకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) డాక్టర్ వెంకటరామన్ అనంత నాగేశ్వరన్(వీఏ నాగేశ్వరన్)ను నరేంద్ర మోడీ సర్కారు నియమించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆయన నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక, శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది.
నాగేశ్వరన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూపకల్ననలో తన సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, డాక్టర్ వీఏ నాగేశ్వరన్ రచయితగా, అధ్యాపకుడిగా, కన్సల్టెంట్‌గా పనిచేశారు. భారత్, సింగపూర్‌లలోని పలు బిజినెస్ స్కూళ్లతోపాటు మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లలో బోధించారు.

2019 నుంచి 2021 వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా కూడా కొనసాగారు. అనంత నాగేశ్వరన్ ఐఐఎం-అహ్మదాబాద్‌లో పీజీ డిప్లొమా, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. నాగేశ్వరన్ క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీ, జూలియస్ బేర్ గ్రూప్‌కి మాజీ ఎగ్జిక్యూటివ్ కూడా.
ఇంతకుముందు సీఈఏగా ఉన్న కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. పరిశోధన, విద్యా ప్రపంచం వైపు తిరిగి వెళ్లేందుకే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.