అయ్యో రామా... వందేభారత్ స్పీడ్ ఇంతేనా?
వందేభారత్ రైలు (Vande Bharat Express) సెమీ హైస్పీడ్ రైలంటూ భారతీయ రైల్వే చెబుతోంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే ప్రయాణికుల అభిప్రాయాలు మాత్రం ఇది కేవలం 83 కిలోమీటర్లేనని స్పష్టం చేస్తోంది. తాజాగా వీటిగురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వందేభారత్ రైళ్లు సగటున 83 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తున్నాయని తేలడం సంచలనాన్ని సృష్టిస్తోంది. రైలు పట్టాలు అధ్వాన్నంగా ఉండటంవల్ల వందేభారత్ రైళ్లు తమ సామర్థ్యానికి మించి ప్రయాణించలేకపోతున్నాయి.
RTI ద్వారా బయటకు..
ఈ విషయం సమాచారహక్కు చట్టంద్వారా బయటకు వచ్చింది. కమర్షియల్ సర్వీసెస్ కోసం గంటకు 130 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ఇవి కేవలం ఒక మార్గంలో 95 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నట్టు స్పష్టమైంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వందేభారత్ ను రూపొందించారు. అయితే ట్రాక్ ఆ వేగాన్ని తట్టుకుంటుందా? లేదా? అనేది తేలాలి. తిరిగే మార్గంలో ట్రాక్ సామర్థ్యం ఎంతమేరకు అనేది అధికారులు తేల్చాలి.

గంటకు 130 కిలోమీటర్లు?
కమర్షియల్ సర్వీస్ కు అత్యధిక వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంటోంది. అయితే వందేభారత్ లు ఆ వేగంతో కూడా ప్రయాణించలేకపోతున్నాయని తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఆర్‌టీఐ ద్వారా ఈ విషయాలను బయటపెట్టారు. 2021-22 సంవత్సరంలో గంటకు 84.48 కిలోమీటర్ల సగటు వేగంతో, 2022-23 ఏడాదిలో గంటకు 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో మాత్రమే ఇవి ప్రయాణిస్తున్నాయని స్పష్టమైంది. భారతీయ రైల్వేకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వందే భారత్ ను రూపొందిస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతున్నాయి. ఇతర కోచ్ ఫ్యాక్టరీల్లో కూడా వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. రైళ్ల వేగం ట్రాక్ సామర్థ్యంపై ఆధారపడివుంటుందని చెబుతున్నారు.
ముంబయి-షిరిడీ 64 కిలోమీటర్లు
ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సాయినగర్ షిరిడీ వందే భారత్ రైలు అత్యంత తక్కువ వేగంతో నడుస్తోంది. ఈ రైలు కనిష్ట వేగం గంటకు 64 కిలోమీటర్లే ఉంది. 2019లో ప్రారంభమైన న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ రైలు సగటు వేగం గంటకు 95 కిలోమీటర్లు. ఆ తర్వాత రాణీ కమలాపతి హబీబ్‌గంజ్-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 94కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే వందే భారత్ రైళ్ల సగటు వేగం మెరుగ్గా ఉన్నట్లు సమాచార హక్కు చట్టంద్వారా తేలింది.












Click it and Unblock the Notifications