Tamil Nadu Results: ఫలితాల వేళ విజయ్ కీలక అడుగులు-ముందున్న 5 ఆప్షన్స్..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల గురించి మాత్రమే చర్చించుకునే తమిళనాడు ఈసారి విజయ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటోంది. దీనికి ఓ ప్రధాన కారణం ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎన్నికలకు ముందే విజయ్ తో కాస్త జాగ్రత్త అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం స్టాలిన్ కు హెచ్చరికలు చేశాయి. ఇప్పుడు అదే నిజమవుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఫలితాల రోజు ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే విజయ్ పార్టీ కీలక స్థానంలో ఉండొచ్చు, లేదా కొత్త ప్రభుత్వంలో నిర్ణయాత్మక శక్తిగా లేదా కీలక కింగ్‌మేకర్ పాత్ర పోషించవచ్చు. అలాంటి పరిస్ధితుల్లో విజయ్ ముందు 5 ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ 1- అతిపెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భావం (Vijay tvk)
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 98-120 సీట్లు గెలిచి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు. ఇది నిజమైతే, విజయ్.. కాంగ్రెస్, మరికొన్ని చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి విజయ్‌తో సమావేశమైనా, అప్పుడు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే, విజయ్ తన ప్రచార సభల్లో కాంగ్రెస్‌ను పెద్దగా విమర్శించలేదు. గతంలో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కోరారు.

ఆప్షన్ 2- అన్నాడీఎంకేతో కలిసి బీజేపీని దూరం పెట్టడం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో టీవీకే ఉంటే, తమిళనాడులో ఎన్‌డిఎకు నాయకత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకే మద్దతును విజయ్ కోరవచ్చు. అయితే ఇదంత సులభం కాదు. తాము మతతత్వ శక్తులతో పొత్తు పెట్టుకోమని విజయ్, టీవీకే సీనియర్ నాయకులు పదేపదే ప్రకటించారు, ఇది బీజేపీతో ఎలాంటి పొత్తు అయినా తిరస్కరించినట్లే. అదే సమయంలో అన్నాడిఎంకే ద్రవిడ వారసత్వం పట్ల విజయ్ సానుకూలంగా ఉన్నారు. ప్రచారంలో తిరుచిరాపల్లిలో ఎంజీఆర్ పట్ల నివాళులర్పించి, తమ భావజాల సారూప్యతను చాటారు.
ఆప్షన్ 3- డీఎంకేకు టీవీకే మద్దతు, డిప్యూటీ సీఎం ఛాన్స్
డీఎంకేకు మెజారిటీ రాకపోతే, టీవీకే గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధిస్తే, ఎన్నికల తర్వాత సమీకరణాలు ఊహించని మలుపు తిరగవచ్చు. కాంగ్రెస్‌తో పొత్తును విజయ్ ఇప్పటివరకు తోసిపుచ్చినప్పటికీ, టీవీకే ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇవ్వడం ఒక అవకాశం. అటువంటి పరిస్థితిలో, విజయ్ డీఎంకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని లేదా అందులో ఉప ముఖ్యమంత్రి వంటి పాత్రను చర్చించవచ్చు. అప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ తరహాలో విజయ్ కు అవకాశం ఉండొచ్చు.
ఆప్షన్ 4 -అన్నాడీఎంకే కు మద్దతు, స్టాలిన్ కు దూరం
అన్నాడీఎంకే కు మెజారిటీ రాకపోతే, విజయ్ తన భావజాలానికి అనుగుణంగా ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. జన నాయగన్ చిత్రం విడుదల, కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతికి సంబంధించిన సీబీఐ విచారణ వంటి ఇతర ఒత్తిళ్లను కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే రాజకీయాలు తరచుగా ఊహించని పొత్తులకు దారితీస్తాయి. ఎన్నికల తర్వాత కీలకమైన పరిస్థితుల్లో, స్టాలిన్‌ను అధికారం నుండి దూరంగా ఉంచడానికి, విజయ్ అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడాన్ని పరిశీలించవచ్చు.

ఆప్షన్ 5 - టీవీకేకు పూర్తి మెజారిటీ
విజయ్ పూర్తి మెజారిటీని సాధించగలిగితే, అది చారిత్రక ఫలితం అవుతుంది. ఎన్నికల అనంతర పొత్తులు లేదా సంకీర్ణ సమీకరణాలపై ఎలాంటి ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. టీవీకే కార్యనిర్వాహక కమిటీ ముఖ్య సమన్వయకర్త కెసెంథోట్టయన్ ఇప్పటికే తమ పార్టీ కనీసం 180 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. అన్నాడిఎంకేతో పొత్తు అవసరాన్ని తోసిపుచ్చుతూ, అసెంబ్లీ హంగ్ అయ్యే ప్రశ్న లేదు, మేము 180 నుండి 200 సీట్లను లక్ష్యంగా చేసుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications