viral video : ఢిల్లీ పోలీసుల కర్కశం-సోనియా విచారణపై నిరసన-కాంగ్రెస్ నేత జుట్టులాగేసి మరీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ మరోసారి పిలిచారు. దీంతో ఆమె తన కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో కలిసి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సోనియాగాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనల్లో పలువురు నేతలు పాల్గొంటున్నారు. దీంతో పోలీసులు కూడా వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు వాహనంలోకి ఆయన్ను ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది.

పోలీసు వాహనంలోకి ఎక్కేందుకు బీవీ శ్రీనివాస్ నిరాకరిస్తూ పోలీసుల్ని ప్రతిఘటించారు. దీంతో ఆయన జుట్టుపట్టుకుని మరీ లాగుతూ పోలీసులు ఆయనపై దాడి చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో బీవీ శ్రీనివాస్ ను కొడుతూ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. అయితే బీవీ శ్రీనివాస్ జుట్టు లాగడం, ఆయన ప్రతిఘటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఢిల్లీ పోలీసుల కర్కశత్వం గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఢిల్లీ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో అక్కడి పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. ఇప్పటికే నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా ఎంపీల దుస్తుల్ని సైతం చించేసిన ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపడం వివాదాస్పదమవుతోంది.
Youth Congress @IYC Chief Mr @srinivasiyc detained by Delhi Police pic.twitter.com/8Hh1LNzZD9
— Supriya Bhardwaj (@Supriya23bh) July 26, 2022












Click it and Unblock the Notifications