విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరూ గమనించలేదు, అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నేరాలు

ఏడాదిన్నరగా డ్రమ్ములో ఉన్న మహిళ మృతదేహం విశాఖపట్నంలోని మధురవాడలో బయటపడింది.

ఆ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా పోలీసులు గుర్తించారు.

మృతదేహాన్ని ముక్కలు చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆమెను హత్య చేసి డ్రమ్ములో పెట్టి నిందితుడు పరారయ్యాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు.

హత్యకు సంబంధించిన పూర్వాపరాలను ఆయన మీడియాకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...

మృతురాలిని ఉంచిన డ్రమ్

పని ఇచ్చిన యాజమాని ఇంటిలోనే హత్య

''ఈ సంఘటన విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో 2021 మే నెలలో జరిగింది. అప్పటి నుంచి మృతదేహం వాటర్ డ్రమ్ములోనే ఉంది.

శ్రీకాకుళంకు చెందిన 29 ఏళ్ల వివాహితుడు రుషివర్థన్, మధురవాడలోని నండూరి రమేశ్ వద్ద వెల్డింగ్ హెల్పర్‌గా 2020 సెప్టెంబర్‌లో చేరారు.

యజమాని రమేశ్ మధురవాడలో ఉన్న మరో ఇంటిని రుషికి అద్దెకు ఇచ్చారు. రుషి భార్య శ్రీకాకుళంలోనే ఉండగా, మధురవాడ ఇంటిలో రుషి మాత్రమే ఉండేవారు.

గత ఏడాది (2021) జూన్ నుంచి రుషి యాజమానికి కనిపించలేదు. ఫోన్ చేస్తే వస్తున్నా అంటూ ఏడాదిన్నర గడిపేశాడు.

ఏడాదిన్నర కాలంపాటు అద్దె రాకపోవడం, తన ఇల్లు ఎలా ఉందో తెలియకపోవడంతో యాజమాని రమేశ్ ఆందోళన చెందారు.’’

మధురవాడ నేరాలు

కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని తలుపు తీస్తే...

“అద్దె చెల్లించాలని ఎన్నిసార్లు యజమాని రమేశ్ కోరినా రుషి ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అనే చెప్పేవాడు.

అయితే ఇంటిలో ఎవరు లేకపోయినా కరెంట్ బిల్లు మాత్రం ఎక్కువగా వస్తోంది.

దాంతో అనుమానం వచ్చిన యాజమాని ఈ ఏడాది జూలైలో ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లారు. వెనుక వైపు డోర్ తెరిచే ఉంది.

అలాగే ఇంట్లో లైట్లు, ఫ్యాన్ వేసి ఉండటంతో వాటిని ఆఫ్ చేసి తాళం వేసేశారు. వెంటనే ఆయన రుషిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాలేదు.”

క్లీన్ చేస్తుంటే వాటర్ డ్రమ్ములో శవం

“రుషి కోసం ఎదురు చూసిన రమేశ్ విగిసిపోయారు. అతని వస్తువులను పక్కన పెట్టేసి... ఇంటిని క్లీన్ చేసి ఎవరికైనా అద్దెకు ఇద్దామనే నిర్ణయానికి వచ్చారు.

దాంతో ఈ నెల 4 తేదీన ఇంటి లోపలకు వెళ్లి శుభ్రం చేయించడం మొదలు పెట్టారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక సీల్ చేసిన డ్రమ్ కనిపించింది. దాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా దుర్వాసన రావడం మొదలైంది.

అనుమానంతో రమేశ్ దానిని అలాగే వదిలేసి ఆ రోజు సాయంత్రమే మధురవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లి చూడగా డ్రమ్ములో ముద్దగా మారిపోయిన ఒక మృతదేహం కనిపించింది. పొడవాటి జుత్తు ఉండటంతో అది మహిళ మృతదేహమేనని అనుమానించాం.”

బస్ స్టాండులో కలిశారు...ఆటోలో ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు

“వెంటనే రుషి ఎక్కడున్నాడనే విషయంపై అతనికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దాంతో అతని ఫోన్ లోకేషన్ ఆధారంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం, బల్లగూడ గ్రామం వెళ్లి రుషిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించాం. విచారణలో అతను ఈ హత్య ఎందుకు చేశాడో వివరించాడు.

రుషి భార్య గర్భవతి కావడంతో ఆమెను 2021 మే 29న శ్రీకాకుళంలో ఆసుపత్రిలో చూపించి ఆయన విశాఖ బయలుదేరారు. బస్సు కోసం ఎదురు చూస్తుండగా అక్కడ ధనలక్ష్మి అనే మహిళ పరిచయమయ్యారు. ఇద్దరూ షేర్ ఆటోలో నాతవలస వరకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. రెండు రోజుల తర్వాత ధనలక్ష్మీ, రుషికి ఫోన్ చేసి తాను కలవడానికి వస్తున్నట్లు చెప్పారు. ఆమెను రుషి మధురవాడలోని తన ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నారు. ఉదయం లేచిన తర్వాత ధనలక్ష్మీ రుషిని డబ్బులు డిమాండ్ చేశారు.”

డబ్బులు అడిగినందుకు...

“రుషి తాను డబ్బులు ఇవ్వనని చెప్పడంతో...ఇరుగుపొరుగును పిలిచి గొడవ చేస్తానని ఆమె అన్నారట. దాంతో ఆమె గొడవ చేస్తుందని మెడకు చున్నీ వేసి లాగినట్లు రుషి చెప్పారు. ఆమె చనిపోవడంతో ఆ డెడ్ బాడీని దుప్పట్లో చుట్టి వాటర్ డ్రమ్ములో వేసి వాసన రాకుండా టైట్‌గా సీజ్ చేసి ఆ ఇంటి నుంచి రుషి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత 13 రోజులు ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఆ తర్వాత యాజమాని ఫోన్ కాల్స్‌కి అందుబాటులోకి వచ్చినా మధురవాడలోని ఇంటికి రాలేదు. అద్దె చెల్లించలేదు. ఇంటి యాజమాని డిసెంబర్ 4న ఆ ఇంటిని క్లీన్ చేస్తుండగా ఈ మృతదేహం బయటపడింది” అని సీపీ శ్రీకాంత్ వివరించారు.

అసిస్టెంట్ కుక్‌గా..

గత ఆరు నెలలుగా కొమ్మాదిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అసిస్టెంట్ కుక్‌గా రుషివర్థన్ పని చేస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

మృతదేహం కుళ్లిపోవడం, ముద్దలా మారిపోవడంతో ఆమెని గుర్తించేందుకు బాడీ శాంపిల్స్ డీఎన్ఏ పరీక్షలకు పంపుతున్నామన్నారు.

“మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మీగా గుర్తించారు. ధనలక్ష్మీ హత్యకు గురైన రోజు నుంచి నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించాం.

300 కేసులు నమోదు కాగా...అందులో ధనలక్ష్మీకి సంబంధించిన కేసు ఏదీ లేదు. శ్రీకాకుళంలో ధనలక్ష్మికి తాత, సోదరి తప్ప మరెవరు లేరు.

అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి నెలల తరబడి రాకపోవడం ధనలక్ష్మీకి అలవాటని, ఇప్పుడు అలాగే ఎక్కడికైనా వెళ్లి ఉంటుందనే ఉద్దేశంతో కేసు పెట్టలేదని తాత, సోదరి తెలిపారు” అని సీపీ శ్రీకాంత్ చెప్పారు.

మృతదేహాన్ని ముక్కలు చేయలేదు: సీపీ

దిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు తరహాలో శవాన్ని ముక్కలుగా నరికినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీపీ శ్రీకాంత్ చెప్పారు.

మృతురాలు సన్నగా ఉండటంతో ఆమెను హత్య చేసి డ్రమ్ములో కుక్కేశారని, ఈ హత్య కేసు విషయంలో రుషికి ఎవరైనా సహాయం చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఎందుకంటే మృతదేహం అంతగా కుళ్లిపోయినా పరిసర ప్రాంతాల వారికి ఏమాత్రం వాసన రాలేదు, వాసన రాకుండా నిందితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, అతనికి ఎవరు సహకరించి ఉంటారనే అనుమానాలున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakhapatnam: Woman's body in water drum, no one noticed for 18 months, what happened?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X