నెల శాలరీ మొత్తాన్నీ విరాళంగా ప్రకటించిన రాహుల్
Kerala landslides: రోజులు గడుస్తోన్నప్పటికీ- కొండచరియలు విరిగిపడిన ఘటన నుంచి కేరళలోని వాయనాడ్ జిల్లా కోలుకోవట్లేదు. ఇదొక పీడకలగా వారిని మలయాళీలను వెంటాడుతూనే వస్తోంది. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించట్లేదక్కడ.
జులై 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత వాయనాడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటన తెలిసిందే. ఈ విపత్తులో 392 మంది వరకు మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలికి వచ్చిన ఉదంతం ఇంకా అక్కడి వారిని పట్టి పీడిస్తూనే ఉంది.

కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. వర్షాలు సైతం దీనికి తోడు కావడం వల్ల ప్రాణ నష్టం మరింత పెరిగింది. మొత్తం మూడు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మెప్పాడి, ముండక్కై, చూరల్‌మాలా, ఆట్టమాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
చూరల్‌మాలా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధిక మరణాలు ఇక్కడే సంభవించాయి. గ్రామం మొత్తం బురద పేరుకుపోయి కనిపించింది. వాటి మధ్యలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ముండక్కై, మెప్పాడి, ఆట్టమాల, విలాంగాడ్ వంటి ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, ఆర్మీ జవాన్లు రోజుల తరబడి సహాయక చర్యలను కొనసాగించారు.
ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా భారీ విరాళాన్ని ప్రకటించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా తనకు అందే నెల రోజుల వేతనం మొత్తాన్నీ కూడా వాయనాడ్ బాధితుల సహాయ నిధికి పంపించారు. కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ జిల్లా రిలీఫ్ ఫండ్‌కు తన నెల రోజుల వేతనం 2,30,000 రూపాయలను చెల్లించారాయన.
ఘోర విపత్తు నుంచి వాయనాడ్ ఇప్పటికీ కోలుకోవట్లేదని, ఊహకు అందని విధంగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి వీలుగా తనవంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని సహాయ నిధికి పంపించినట్లు వివరించారు. వాయనాడ్‌లో మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా భారతీయులందరూ తమవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications