మమత బెనర్జీ సంచలన నిర్ణయాలు
RG Kar gang rape case: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ దీని తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. మరింత పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ఉధృతమౌతున్నాయి.
ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు.
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.
ఈ పరిస్థితుల మధ్య పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెట్టు దిగారు. ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు షాక్ ఇచ్చారు. నేషనల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా ఆయన నియామకాన్ని రద్దు చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.
మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన సమయంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్.. సందీప్ ఘోష్. ఈ ఉదంతంలో ఆయనకూ ప్రమేయం ఉందని, నిందితులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. సీబీఐ ఆయనను విచారిస్తోంది.
ఈ ఘటన తరువాత ఆయనను నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దీనిపైనా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్న నిందితుడికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం పట్ల బెంగాళీయులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. దీనితో ఆయన బదిలీ, నియామకాన్ని రద్దు చేసింది.
అదే సమయంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ బదిలీలను చేపట్టిందక్కడి ప్రభుత్వం. ఆర్జీ కార్ మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపల్‌గా బాంకురా సమ్మిళన్ మెడికల్ కాలేజీ ఎంఎస్‌వీపీ డాక్టర్ సప్తర్షి ఛటర్జీని నియమించింది. సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ బుల్‌బుల్ ముఖోపాధ్యాయ నియమితులయ్యారు.
ఆర్జీ కార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శృతి పాల్‌పై కూడా బదిలీ వేటు పడింది. బరాసత్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ అయ్యారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్‌గా బరాసత్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మానస్ కుమార్ బందోపాధ్యాయ అపాయింట్ అయ్యారు. ఆర్జీ కార్ ఛెస్ట్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ అనుభ దత్త చౌదరిని మాల్దా మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది.












Click it and Unblock the Notifications