వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మూన్‌లైటింగ్

కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికలపై ''మూన్‌లైటింగ్'' గురించి చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై తమ ఉద్యోగులకు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ హెచ్చరికలు కూడా జారీచేసింది.

ఉద్యోగులకు ఈ విషయంపై ఇన్ఫోసిస్ ఒక ఇ-మెయిల్‌ను పంపించింది. ఇలాంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. మొత్తంగా ఉద్యోగం నుంచి తీసివేసే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించింది.

మరోవైపు మూన్‌లైటింగ్‌ను మోసంగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు. ''ఈ విషయంపై టెక్ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మూన్‌లైటింగ్‌కు పాల్పడటమంటే సంస్థకు ద్రోహం చేయడమే''అని ఆయన వ్యాఖ్యానించారు.

https://twitter.com/RishadPremji/status/1560894886026440704

లక్షల మంది ఉద్యోగులున్న మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా మూన్‌లైటింగ్‌పై స్పందించింది. ఉద్యోగులు ఇలా చేయడం అనైతికమంటూ బుధవారం సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయంపై ఐబీఎం దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ మాట్లాడారు. ''కంపెనీలో చేరేముందే, ఉద్యోగులంతా కేవలం ఐబీఎం కోసమే పనిచేస్తామని ఒక ఒప్పందంపై సంతకం చేస్తారు''అని ఆయన చెప్పారు.

''ఖాళీ సమయాల్లో ఉద్యోగులు తమకు నచ్చిన పని చేసుకోవచ్చు. కానీ, మూన్‌లైటింగ్‌ చేయడం మాత్రం సరికాదు''అని సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమం అనంతరం విలేఖరులతో ఆయన అన్నారు.

మూన్‌లైటింగ్ వల్ల ఉద్యోగుల ప్రోడక్టివిటీపై ప్రభావం పడుతుందని, ఫలితంగా తమకు నష్టం జరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

మూన్‌లైటింగ్ అంటే ఏమిటి?

మూన్‌లైటింగ్ అంటే మాతృసంస్థకు తెలియకుండా ఉద్యోగి వేరే సంస్థల కోసం పనిచేయడం. ఒక్కోసారి ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల కోసం పనిచేస్తుంటారు. ఇది కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదు. చాలా రంగాల్లో ఇది కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం ఫ్రీల్యాన్సింగ్ పేరుతో ఉద్యోగులు వేరే సంస్థల కోసం పనిచేస్తుంటారు.

సాధారణంగా రోజులో ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు మాతృసంస్థ కోసం పనిచేసిన ఉద్యోగులు రాత్రిపూట ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. అందుకే దీన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. అయితే, సాధారణంగా దీనికి ఒక నిర్దేశిత సమయం అంటూ ఉండదు. నైట్ షిఫ్టులు చేసేవారు కూడా మధ్యాహ్నం పూట వేరే సంస్థ కోసం పనిచేస్తుంటారు.

మూన్‌లైటింగ్‌లో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది మాతృసంస్థ కోసం పనిచేసే ప్రాజెక్టుల తరహా ప్రాజెక్టులను వేరే సంస్థల నుంచి తీసుకుంటారు. మరికొందరు డెలివరీ సంస్థల కోసం పనిచేస్తారు. ఇంకొందరు వెయిటర్‌గా కూడా చేస్తుంటారు. ట్రాన్స్‌లేషన్స్, డబ్బింగ్, రైటింగ్, వెబ్‌సైట్ బిల్డింగ్, మార్కెటింగ్, కన్సల్టెంగ్ ఇలా చాలా పనులుంటాయి.

ఈ పనులపై మాతృసంస్థలకు సాధారణంగా ఎలాంటి సమాచారమూ ఉండదు. మూన్‌లైటింగ్ విషయంలో ఒక్కో సంస్థ ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటుంది.

భిన్న స్పందనలు..

నిజానికి మూన్‌లైటింగ్ విషయంలో అన్ని సంస్థలూ ఒకేలాంటి అభిప్రాయంతో లేవు. దీన్ని మోసంగా పరిగణించాల్సిన అవసరంలేదని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ ఇటీవల చెప్పారు.

ఇంగ్లిష్ వార్తల వెబ్‌సైట్ బిజినెస్ టుడేతో ఆయన మాట్లాడారు. ''మాతృసంస్థ కోసం ఇన్ని గంటలు పనిచేయాలని ఒప్పందం చేసుకుంటాం. ఆ సమయంలో మనం సంస్థ చెప్పేవి తూచా తప్పకుండా పాటించాలి. ఇక ఆ తర్వాత, ఇంట్లో ఖాళీ సమయాల్లో మనకు నచ్చినది మనం చేసుకోవచ్చు''అని ఆయన అన్నారు.

ఇదివరకు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూలేదని చెప్పింది.

''పనివేళలు లేదా వీకెండ్ సమయాల్లో మినహా.. ఖాళీ సమయాల్లో ఉద్యోగులు తమకు నచ్చిన పని చేసుకోవచ్చు. అయితే, దీని వల్ల మా సేవలపై ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఉద్యోగుల ప్రోడక్టివిటీ కూడా ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి''అని స్విగ్గీ వివరించింది.

అయితే, కొన్ని సంస్థలు మాత్రం మూన్‌లైటింగ్ వల్ల తమ ఉద్యోగులు తమ పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారని చెబుతున్నాయి. వారాంతంలో ఇచ్చే సెలవుల్లో పనిచేయడం వల్ల అదనంగా సెలవులు పెట్టాల్సి వస్తుందని, ఫలితంగా వారి ప్రోడక్టివిటీపై ప్రభావం పడుతోందని వివరిస్తున్నాయి.

అయితే, కొందరు మాత్రం ఉద్యోగుల స్వేచ్ఛను కూడా మనం గుర్తించాలని అంటున్నారు. కేవలం ఆఫీసులో ఉన్నంత వరకు మాతృసంస్థ నిబంధనలను అనుసరిస్తే సరిపోతుందని వివరిస్తున్నారు.

మరి మూన్‌లైటింగ్ చేసే ఉద్యోగులు ఏమంటున్నారు? ఎందుకు వీరు ఇతర ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది?

మూన్‌లైటింగ్

మూన్‌లైటింగ్ ఎందుకు చేస్తారు?

ఈ విషయంపై ఓ ఐటీ కంపెనీ కోసం పనిచేస్తున్న అమన్ వర్మ (పేరు మార్చాం) బీబీసీ ప్రతినిధి ప్రియాంకా ఝాతో మాట్లాడారు. మూన్‌లైటింగ్‌కు ప్రధాన కారణం ఆదాయం సరిపోకపోవడమేనని ఆయన అన్నారు. అయితే, మరికొన్ని కారణాలు కూడా దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు.

''ఆఫీస్‌లో నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తాను. కానీ, ఏదైనా కారణంతో నేను సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా మారాలనుకుంటే, నాకు ఆఫీస్‌లో వీలుపడదు. ఎందుకంటే ఇక్కడ ఆ పనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను ఇది మాత్రమే చేయాలని నిబంధనలు ఉంటాయి. అయితే, ఫ్రీలాన్సింగ్‌లో ఇలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనకు నచ్చిన ప్రాజెక్టులు తీసుకోవచ్చు. అలా మన నైపుణ్యాలనూ మెరుగు పెట్టుకోవచ్చు''అని ఆయన అన్నారు.

ఫ్రీలాన్సింగ్‌ను ఉద్యోగం కింద చూడకూడదని అమన్ అంటున్నారు. ''ఎందుకంటే ఇక్కడ పీఎఫ్, గ్రాట్యుటీ లాంటివేమీ ఉండదు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అందుకే వీటిని రెండు ఉద్యోగాలుగా పరిగణించకూడదు. దీన్ని ఆపేయాలని సంస్థలు సూచించకూడదు''అని ఆయన వివరించారు.

ఆర్థికపరమైన అంశాల్లో చాలా మంది అభద్రతా భావంతో ఉంటారని, వారికి మూన్‌లైటింగ్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ''కోవిడ్ సమయంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు భిన్న మార్గాల్లో ఆదాయం సంపాదించడంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు''అని ఆయన అన్నారు.

అలానే ఓ సంస్థ కోసం వీడియో ఎడిటర్‌గా పనిచేసే అర్చనా సింగ్ కూడా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి కమలేశ్ మఠేనీతో ఆమె మాట్లాడారు.

''నేను ముంబయికి వచ్చినప్పుడు నా జీతం చాలా తక్కువగా ఉండేది. దీంతో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా వీలయ్యేది కాదు. అప్పుడే వీడియో ఎటింగ్ ఫ్రీల్యాన్సింగ్ మొదలుపెట్టాను. కొన్నిసార్లు కష్టమైన ప్రాజెక్టులు వస్తుంటాయి. దీనివల్ల నా నైపుణ్యాలు మరింత మెరుగుపడుతున్నాయి. దీంతో నేను పనిచేసే ప్రధాన సంస్థకు కూడా మేలు జరుగుతుంది''అని ఆమె అన్నారు.

ఆఫీస్‌లో తనతోపాటు పనిచేసే చాలా మంది తనలానే ఫ్రీలాన్సింగ్ చేస్తారని అర్చన చెప్పారు. ''లాక్‌డౌన్ సమయంలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ప్రయాణ సమయం అప్పట్లో చాలా తగ్గింది. చాలా మంది ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవారు. ఖాళీగా ఉండటంతో ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం ఎక్కువైంది''అని ఆమె వివరించారు.

భారత్‌లో మూన్‌లైటింగ్ విషయంలో ప్రత్యేకమైన నిబంధనలేమీ లేవు. అయితే, కంపెనీలు మాత్రం ఉద్యోగులు విధుల్లోకి చేరే సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని చెబుతున్నాయి.

ముఖ్యంగా సంస్థ సేవలపై ప్రభావం పడకుండా చూడటం, క్లయింట్ల విషయంలో గోప్యత పాటించడం లాంటి నిబంధనలు ఆ ఒప్పందంలో ఉంటాయి.

కొన్ని సంస్థలు ఖాళీ సమయాల్లో ఇతర పనులు చేయకూడదని స్పష్టంగా చెబుతుంటాయి. ఒకవేళ సంస్థలు ఇలా స్పష్టంచేస్తే, మూన్‌లైటింగ్‌ను మోసంగానే పరిగణిస్తారు. నిజానికి చాలా సంస్థలు ప్రస్తుతం ఈ నిబంధనను పెడుతున్నాయి.

ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం, ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయకూడదు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఐటీ సంస్థలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is moonlighting? Why are companies like Infosys and Wipro angry about this?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X