వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్: తమిళనాడు రాజకీయ పార్టీల నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కొంతమంది సీనియర్ నేతలను తీసుకుని తాను తొందర్లో తమిళనాడు వెళ్తానని.. అక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకేల నిర్మాణాన్ని పరిశీలిస్తానని వారం కిందట టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు.

పదమూడేళ్ల మహత్తర ఉద్యమం నడిపిన పార్టీ, రెండు ఎన్నికల్లో అజేయంగా నిలిచి, ఏడేళ్లు పాలన చేసిన పార్టీ తమిళనాడు నుంచి నేర్చుకోవలసింది ఏమిటి? అందులోనూ డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ పార్టీల నుంచి నేర్చుకోవలసింది ఉంటుందా?

అయితే, డీఎంకే నుంచి నేర్చుకోవలసిందేమిటో ఆయన మీడియాకు వివరించారు.

"డీఎంకే నిర్మాణంలో కొన్నిఆసక్తికరమయిన అంశాలు ఉన్నాయి. వాటిని మేం టీఆర్‌ఎస్ విధానాల్లో పొందుపరుస్తాం. ఉదాహరణకు డీఎంకే వాళ్లకి పల్లెల్లో కూడా కార్యాలయాలున్నాయి. వాళ్ల కార్యకర్తల్లో పార్టీ పట్ల అసాధారణ విధేయత ఉంటుంది. ఆ పార్టీ దాదాపు అరవై డెబ్బై ఏళ్లుగా కొనసాగుతూ తిరుగులేని శక్తి అయింది. అలా టీఆర్‌ఎస్ కూడా తెలంగాలో స్థిరపడాలనుకుంటున్నాం,' అని కేటీఆర్ అన్నారు.

ఇలాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలు భారతదేశంలో మరికొన్ని ఉన్నాయి. వాటిని కాకుండా ద్రవిడ పార్టీలనే కేటీఆర్ ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎందుకు?

ద్రవిడ పార్టీల గొప్పతనమేమిటి?

ఓటర్లకు భారీగా కానుకలను అందించడంలో తప్ప డీఎంకే, టీఆర్‌ఎస్ మధ్య ఎలాంటి పోలికా లేదు. డీఎంకే ఒక సైద్ధాంతిక పునాదిపై నిలబడిన పార్టీ.

ద్రవిడ జాతీయత అధారంగా ప్రజలను ఏకం చేసిన పార్టీ. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కోసం నిలబడిన పార్టీ. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణేతరులకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించి, తొలిసారి సాంఘిక న్యాయం కోసం పోరాడిన చరిత్ర నుంచి పుట్టిన పార్టీ.

బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకత, ఉత్తరాధిపత్య వ్యతిరేకత, హిందీ ఆధిపత్య వ్యతిరేకత, సాంఘిక న్యాయం డీఎంకే విధానాల్లోని ప్రధానాంశాలు. ఈ చట్రంలో టీఆర్‌ఎస్ ఇమడలేదు. కేసీఆర్ పార్టీకి బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకత లేదు, హిందీ వ్యతిరేకత అసలూ లేదు, బీసీలకు రాజ్యాధికారం అనే సాంఘిక న్యాయమూలేదు.

మరి డీఎంకే నుంచి నేర్చుకోవలసిందేముంటుంది?

తమిళనాడులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అక్కడ బీజేపీకి రాజకీయ వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకుండా చేయడంలో ద్రవిడ పార్టీలు విజయవంతమయ్యాయి.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనపుడు మద్దతునిచ్చినా కమలం తమిళనాడులో వికసించకండా నివారించగలిగాయి.

జయలలిత

వాజపేయీ హయాంలో వీలు కాలేదు, చివరకు మోదీ గాలి వీస్తున్నపుడు కూడా కాలేదు. చివరకు ఏఐఏడీఎంకేతో 2001 ఎన్నికల పొత్తుతో నాలుగు స్థానాల్లో గెలిచింది బీజేపీ.

తమిళనాడులో బీజేపీ మొట్టమొదటిసారి 1996లో పద్మనాభపురం అసెంబ్లీ సీటు గెల్చుకుంది. తర్వాత 2001లో డీఎంకేతో పొత్తు పెట్టుకుని 21 స్థానాలలో పోటీ చేసింది. అపుడు నాలుగు స్థానాలు గెల్చుకున్నారు.

అదే చివరి సారి. 2001నుంచి మళ్లీ పొత్తులున్నా, లేకున్నా బీజేపీ అభ్యర్థులు అసెంబ్లీ సీటు గెలవలేదు. 2006, 2011, 2016 ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా బీజేపీ తమిళనాడు అసెంబ్లీకి పంపించలేకపోయింది.

ఇలా బీజేపీని తమిళనాడు అడ్డుకున్న వైనం టీఆర్‌ఎస్‌కు ఆసక్తి కలిగిస్తూ ఉండవచ్చని బీబీసీతో మాట్లాడిన కొందరు పరిశీలకులు చెబుతున్నారు.

కరుణానిధి

తమిళనాడు బీజేపీని ఎలా అడ్డుకుంది?

తమిళనాడులో బీజేపీ కాలుమోపలేకపోయేందుకు, కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయేందుకు అక్కడి ద్రవిడ జాతి ప్రాంతీయ వాదమే కారణమని చెన్నైకి చెందిన జర్నలిస్టు సంధ్యా రవిశంకర్ అన్నారు.

"తమిళప్రజల్లో బలమైన ప్రాంతీయ, ద్రవిడ జాతీయ వాదం ఉంది. ఈ వాదానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. దీని ప్రకారం బ్రాహ్మణలు ఆర్యులు, వాళ్ల పెత్తనం చెల్లదు. కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీలు, వాళ్ల పెత్తనం చెల్లదు. తమిళ జాతి, ద్రవిడ జాతి మనది. ఇక్కడ మనదే అధికారం అనే అంశాలు తమిళ ప్రజలను బాగా ప్రభావితం చేసేలా ఒకప్పుడు జస్టిస్ పార్టీ, తర్వాత డీఎంకేలు చేశాయి.

ఈ మూడు కారణాల వల్ల అంటే 1. బ్రాహ్మణ వ్యతిరేకత 2. ఉత్తరాది వ్యతిరేకత 3. భూమిపుత్రుల తమిళ, ద్రవిడ వాదం వల్ల తమిళనాడు బీజేపీకి అనుకూలంగా లేదు' అని సంధ్యారవిశంకర్ అన్నారు

మొత్తానికి, కేటీఆర్ ప్రకటించిన విషయం కొన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. డీఎంకేలోని సామాజిక న్యాయం అనే అంశం కాదు, బీజేపీ తమిళ రాష్ట్రంలో కాలుమోపకుండా అడ్డుకునేలా ప్రజలను ద్రవిడ పార్టీలు ఎలా మలచగలిగాయి అనేదే టీఆర్‌ఎస్ కు ప్రధానాంశమని కొంతమంది భావిస్తున్నారు.

కేటీఆర్ తమిళనాడు పర్యటన వార్త చదివిన వాళ్లందరికీ టీఆర్‌ఎస్, బీజేపీ వ్యతిరేక నమూనావైపు చూస్తుందనే అనుమానం వస్తుంది.

తమిళనాడు తరహా ప్రాంతీయ వాదం సాధ్యమా?

డీఎంకే రాజకీయాలను కేటీఆర్ పరిశీలించాలనుకోవడానికి రెండు కారణాలుండవచ్చని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు.

'తమిళనాడు రాజకీయాలు పూర్తిగా ప్రాంతీయమైనవి. ఈ ప్రాంతీయ వాదం చూపి జాతీయ పార్టీలను తమిళపార్టీలు రాష్ట్రంలోకి రాకుండా చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందువల్ల బీజేపీని దూరంగా పెట్టేందుకు అక్కడి ప్రాంతీయవాద మోడల్‌ని స్టడీ చేసేందుకు కేటీఆర్ వెళ్లవచ్చు. ఎందుకంటే, ఇక్కడ కూడా తమిళనాడు తరహా ప్రాంతీయవాద ధోరణిని టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రదర్శిస్తూ ఉంది" అని కృష్ణసాగర్ రావు తెలిపారు. పేరు దక్షిణ భారతదేశమయినా,ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పొలిటికల్ మోడల్ ఉందని, ఒక నమూనా మరొక రాష్ట్రంలో పనిచేయదని ఆయన అన్నారు.

" కర్నాటకలో ఒక తీరు రాజకీయాలుంటే, తమిళనాడులో మరొక తరహా ఉన్నాయి. కేరళ మోడలే వేరు. అలాగే ఇతర రాష్ట్రాల రాజకీయాలు దేనికవే భిన్నమైనవి. తెలంగాణలో బీజేపీ బలపడుతూ ఉంది, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన తీరువల్లే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలో మంచి పేరుతెచ్చుకున్నారు. తెలంగాణలో అది వీలుకాలేదనే అభద్రతా భావం కూడా కేటీఆర్‌లో ఉండొచ్చు. అందుకే ఆయన డీఎంకే ఎలా పనిచేస్తున్నదో చూడాలని ఆత్రుత పడుతుండొచ్చు' అని కృష్ణసాగర్ రావు అన్నారు.

బీజేపీతో ముప్పే అని భావిస్తున్న టీఆర్ఎస్

టీఆర్ఎస్ ఒక కొత్త నమూనా కోసం తమిళనాడు వైపు చూసేందుకు తగిన కారణాలున్నాయని తెలంగాణ జన సమితి (టీజేఎస్ ) నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.

ఇటీవల టీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉందని, పార్టీనాయకత్వంలో కొంత అశాంతి కూడా మొదలైందని కోదండరామ్ చెప్పారు.

ఇటీవల శక్తి కూడదీసుకుంటున్న కాంగ్రెస్ ఒక కారణమయితే, దూరాన రెపరెపలాడుతున్న బీజేపీ మరొక కారణమని ఆయన అన్నారు.

కేసీఆర్ నిరంకుశ విధాలనా మీద ప్రజల్లో కనిపిస్తున్నవ్యతిరేకత మూడో కారణమని ఆయన అన్నారు.

కోదండరామ్ 2009నుంచి తెలంగాణ వచ్చే వరకు సాగిన ఉద్యమానికి జేఏసీ (తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ) చైర్మన్ గా నాయకత్వం వహించారు. జేఏసీ అనేది అనేక పార్టీల, ప్రజా సంస్థల వేదిక.

ఈ వేదిక నాయకత్వంలో రెండో దశలో నడిచిన ఉద్యమం చాలా గొప్పదని, ఒకపార్టీ నాయకత్వం నుంచి ఉద్యమం ప్రజానాయకత్వంలోకి వచ్చిందని ఆయన అన్నారు.

ఈ ఉద్యమం ఎలా ప్రజాస్వామికమైందో తెలంగాణ వచ్చాక ప్రభుత్వం కూడా అలా ప్రజాస్వామికంగా ఉండాలని తాము భావించామని.. కానీ, అది జరగ లేదని కోదండరామ్ అన్నారు.

" తెలంగాణలో ప్రజలు బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. వచ్చేది బీజేపీయా మరొక పార్టీయా అనేది ప్రజలకు ముఖ్యంకాదు. బీజేపీ బలంగా దూసుకొస్తోంది. అయితే, మతతత్వ శక్తుల ప్రాబల్యం తెలంగాణలో ఎక్కువ కాలం నిలవదు. రజాకార్ల దురాగతాలు చూసి కూడాతెలంగాణ ప్రజలు హిందూత్వవాదులు కాలేదు. అయినా ఇపుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు కనబడుతుంది. దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వ విధానాలే అనక తప్పదు.

ఉద్యమంలో పాలుపంచుకున్న సామాజిక వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు భావించారు. ఆ ఆకాంక్షలకు సంస్థాగత రూపం వస్తుందని ఆశపడ్డాం.

ఉదాహరణకు, గల్ఫ్ కార్మికులు, చేనేత కుటుంబాలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులుకు, టీచర్లకు, రైతులకు సంబంధించిన విధానరూపకల్పనలో ఉద్యమంలో పాల్గొన్న ఈ వర్గాలకు ప్రతినిధులకు భాగస్వామ్యం ఉండాలనుకున్నాం.

అయితే, టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి కేసీఆర్ దాన్ని ఎన్నికల పార్టీ గామార్చేశారు. ఎన్నికల్లో పదే పదే గెలవాలన్నది గీటురాయిగా పెట్టుకుని విధానాలు రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడా నిరసన గొంతు వినిపించకుండా నొక్కేసారు. చివరకు నిరసన తెలిపేందుకు నాలుగ్గంటలు నినాదాలిస్తూ కూర్చునే ధర్నాచౌక్ ను మూసేశారు. కొట్లాడి దానిని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులున్నపుడు ప్రజలు మరొక ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తారు.,' అని ఆయన అన్నారు.

బీజేపీ నుంచి ముప్పు కనిపిస్తూ ఉండటంతో ఆ పార్టీని అడ్డుకునేందుకు తమిళనాడులో ఏదైనా ఉపాయం దొరుకుతుందేమోనని వెదుకుతున్నట్లు కనిపిస్తుందని కోదండరామ్ అన్నారు.

రాజనీతి శాస్త్ర పరిశోధకుడు, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ అధ్యాపకుడు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక చర్చనీయాంశం కావడానికి టీఆర్ఎస్ పార్టీ విధానాలే కారణమని అన్నారు.

" తెలంగాణ ఉద్యమాన్ని ఏ పార్టీకి ముడేయలేం. టిఆర్ఎస్ అనే ఒక పార్టీ పైకి కనపడుతున్నా, అదొక ప్రజా ఉద్యమపు రాజకీయముఖంగా కొనసాగింది. అన్ని కులాల వాళ్లు ఏ ఊరికా ఊరిలో జేఏసీలు పెట్టుకుని స్థానికంగా ఉద్యమం నడిపించారు. ఉద్యమాన్ని మూలమూలనా సాగించింది వీళ్లే. అంతిమంగా చూస్తే ఉద్యమానికి వీళ్లందరూ నాయకులే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వీళ్ల ఆకాంక్షలకు చోటే లేకుండా పోయింది. కెసిఆర్ ప్రభుత్వం విశాల ప్రతిపాదిన కాకండా 'ప్రతిపక్ష ముక్త తెలంగాణ'గా రాష్ట్రాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంది. ఫిరాయింపులను ప్రోత్సహించింది. చివరకు ఏమయింది ప్రతిపక్షమనేది అంతరించి ఒక శూన్యం ఏర్పడింది. రాజకీయాల్లో ఇంతశూన్యం ఏర్పడినపుడు భారీ మార్పులొస్తాయి. శూన్యంలోకి ఎవరైనా చొరబడతారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు బాగా బలహీనంగా ఉన్నాయి.ఇపుడు జోరుగా ఉన్నది, అవకాశం కోసం ఎదురుచూస్తున్నది భారతీయ జనతా పార్టీయే. అందుకే తెలంగాణలో తానే టిఆర్ఎస్ ప్రత్యామ్నయమని నిరూపించుకునేందుకు బిజెపి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది' అని ప్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు.

ఈ నేపథ్యంలో బిజెపిని సరిహద్దుల్లోకి రానీయకుండా అడ్డుకున్న తమిళనాడులో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని టిఆర్ఎస్ ద్రవిడ పార్టీల వైపు చూస్తూ ఉండవచ్చు అని ఆయన అన్నారు.

ఇటీవల బిజెపి 'తెలంగాణ వ్యూహం' అనుకోకుండా బలపడుతూ ఉంది. ఇపుడు టిఆర్ఎస్ నుంచి బయటకు పోయిన ఈటెల రాజేందర్ బిజెపికి కొండంత 'తెలంగాణ విశ్వాసం' అందించారు.

హుజూర్‌నగర్ ఎన్నిక ఫలితమెలా ఉన్నా ఈటెల రాజేందర్ ముందు నిలబెట్టి బిజెపి చాలా దూరం నడవాలనుకుంటున్నది.

ఈటెల బిజెపి చేరిక టిఆర్ ఎస్ లో కొంతకలవరం స్పష్టిస్తూ ఉన్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో చెబుతున్న విషయాలే సాక్ష్యం.

బిజెపి నుంచి ముప్పు ఉందనే ఆందోళన, ఏకుగా ఉన్న ఈటెల మేకవుతాడనే ఆందోళన పార్టీలో ఉన్నట్లు హరీష్ ప్రచారం చెబుతోంది.

"ఈటెల రాజేందర్ హజూరాబాద్‌లో గెలవడం లేదు. గెల్చినా ఆయన మంత్రి అవుతాడా? గెల్చినా ఆయన ఏమయినా చేస్తాడా? అక్టోబర్ 30 తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉండేది కేసీఆరే" అని చెప్పాకే ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటేయమంటున్నారు.

గెల్లు గెలిపిస్తే తాను హుజూరాబాద్‌లోనే మకాం వేసి ప్రజలకు సేవచేస్తానని చెబుతున్నారు. ఈ తరహా ప్రచారం సారాంశం ఏమిటో వివరణ అవసరం లేదు.

బీజేపీ ప్రభావం ఎంతో ఉందో హరీష్ క్యాంపెయిన్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో బిజెపిని అడ్డుకునే మోడల్ కోసం తమిళనాడు వైపు, అక్కడి ద్రవిడ పార్టీవ్యూహాల వైపు టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చూస్తున్నారేమో అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What KTR wants to learn from Tamilnadu politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X