Miyazaki Mango:ప్రపంచంలో ఖరీదైన మామిడి -కేజీ 2.7లక్షలు -ఎంపీలో 7పండ్లకు 6 కుక్కలు, 4గార్డుల కాపలా
మామూలుగా మనదేశంలోనైతే వర్షాకాలం ఎంట్రీతోనే మామిడి కాయల సీజన్ ముగుస్తుంది. కానీ 'మియాజాకీ' కథే వేరు. జపాన్ కు చెందిన ఆ మామిడి రకం.. అనూహ్య, ఆసక్తికర పరిస్థితుల్లో ఇండియాలోని ఓ గ్రామంలో మొలకెత్తింది. కొద్ది రోజుల కిందటే పిందెలు కాస్తా పండ్లుగా మారాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే స్థాయిలో వీటి ధర ఉండటంతో కాపలా కోసం కనీవినీ ఏర్పాట్లు జరిగాయి. అసలీ మియాజాకీ కథేంటో, ఆ కాపలా కుక్కల కమామిషు ఏమిటో చూద్దామా..

7పండ్లకు 6 కుక్కలు కాపలా
గడిచిన కొద్ది రోజులుగా భారత్ లో 'మియాజాకీ మ్యాంగో' గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన రైతు దంపతులు తమ తోటలోని మియాజాకీ మామిడి చెట్టుకు కాసిన పండ్ల ను కాపాడుకోవడం కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడంతో చర్చ తారాస్థాయికి చేరింది. ఎంపీలోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు తమ తోటలోనో మామిడి చెట్టు కోసం ఆరు కుక్కలు, నలుగురు గార్డులతో కాపలా ఏర్పాటు చేసుకున్నారు. రూబీ రంగులో ఉండే ఆ మామిడిపండ్ల ధర అంతర్జాతీయ మార్కెట్ లో కేజీ రూ.2.7లక్షలట మరి!

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి..
సంకల్ప్ పరిహార్ దంపతుల తోటలోనిది మియాజాకీ మామిడి చెట్టని వాళ్లు ఆలస్యంగా తెలుసుకున్నారు. అదెలాగో తెలుసుకునే ముందు, మియాజాకీ కథేంటో చూద్దాం. దాదాపు జపాన్‌లో మాత్రమే కనిపించే అరుదైన మామిడి రకం మియజాకీ. సాధారణ మామిడితో పోల్చితే మియజాకీ 15 రెట్లు ఎక్కువ తియ్యగా ఉండటంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలను పంచుతుంది. జపాన్ లో వీటిని తోటల్లో కాకుండా ఇళ్లలోనే కుండీల్లో పెంచుతారు. మూడు, నాలుగు అడుగుల ఎత్తులోనే మియజాకీ కాయలు కాస్తాయి. పూర్తిగా సేంద్రియ విధానంలో సాగుచేసే మియాజాకీ ధర అంతర్జాతీయ మార్కెట్లలో కేజీకి రూ.2.7లక్షలు పలుకుతుందని జపాన్ పత్రికలు రాశాయి. ఔషద గుణాలూ ఉన్న మియజాకీ మామిడి పండ్లు జపాన్ నుండి పలు దేశాలకు రవాణా అవుతూ ఉంటాయి. మన దేశంలోనూ వీటికి భారీగా డిమాండ్ ఉంది. అయితే..

రైలులో ఓ అజ్ఞాత వ్యక్తి ద్వారా..
ప్రపంచంలోనే ఖరీదైన మామిడి రకం అనే విషయం తెలియకుండానే సంకల్ప్ పరిహార్ దంపతులు తమ తోటలో దీన్ని నాటారట. రెండేళ్ల కిందట వాళ్లోసారి పని మీద చెన్నై వెళ్లొస్తుండగా, రైలులో ఓ అజ్ఞాత వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరికీ కామన్ ఇంట్రెస్ట్ మామిడి తోటల పెంపకం కావడంతో గంటలపాటు వాటి గురించే మాట్లాడుకున్నారట. కలిసి ప్రయాణం చేసినందుకు గుర్తుగా ఈ మొక్క నాటండంటూ ఆ అజ్ఞాత వ్యక్తి మియజాకీని చేతులో పెట్టాడని, ఏడాది తర్వాత పళ్లు కాశాకగానీ, అవి ఎంత విలువైనవో తెలీయలేదని పరిహార్ దంపతులు చెబుతున్నారు. అయితే, తోటలో వెరైటీ మామిడి పండ్లేవో కాశాయని ఊరంతా ప్రచారం కావడంతో, తొలి ఏడాది కోతను ఊళ్లోని పోకిరీ దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఈఏడాది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారా దంపతులు. మార్కెట్ విస్తరిస్తున్నకొద్దీ మన జాతీయ ఫలం కాస్తా అంతర్జాతీయ బ్రీడ్లుగా, అత్యంత ఖరీదుతో మళ్లీ మన దగ్గరికే రావడం ఏదైతే ఉందో..












Click it and Unblock the Notifications