ఆసుపత్రిలో 'అమ్మ': జయలలిత వారసుడు హీరో అజిత్ అంటూ ప్రచారం?
చెన్నై: అనారోగ్యం కారణంగా గత 15 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె కోసం రాష్ట్రం మొత్తం కలత చెందుతోంది. ఆమె ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నారు.
ఆమె అనారోగ్య పరిస్థితిపై ఊహాగానాలు తీవ్రం కావడంతో ఆమె రాజకీయ వారసులు ఎవరనే విషయమై తమిళనాట ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయాక 1989లో ఆ పార్టీ పగ్గాలు జయలలిత చేపట్టారు.
అప్పటి నుంచి ఈనాటి వరకు పార్టీలో జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఏక ఛత్రాధిపత్యంతో పార్టీని నడిపారు. తన ముందు సాగిలపడే కార్యకర్తలకు పురుచ్చితలైవి అమ్మగా, తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ పాలన సాగించారు. ఈ క్రమంలో ఆమె ప్రత్యామ్నాయంగా పార్టీలో రెండో స్థానంలో ఎవరిని ఎదగనీయలేదు.

ఈ క్రమంలో జయలలితకు వారసులు ఎవరనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. 18 ఏళ్ల అవినీతి కేసులో ఆమెకు కోర్టు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ 2014లో తీర్పు చెప్పడం, పర్యవసానంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో మొదటిసారి చర్చకు వచ్చింది.
ఆ సమయంలో పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. అమ్మ తరుపున బాధ్యతలు స్వీకరించిన ఆయన సీఎం కార్యాలయంలోకి కూడా అడుగుపెట్టకుండా తన మంత్రిత్వ కార్యాలయం నుంచే విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2015లో జయలలితపై అవినీతి ఆరోపణలను హైకోర్టు కొట్టివేయడంతో పన్నీరు సెల్లం సీఎం పదవికి రాజీనామా చేశారు.
మళ్లీ తిరిగి అమ్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో అమ్మ వారుసులు ఎవరనే అంశం చర్చకు వచ్చింది. తమిళనాడు స్థానిక వార్తా పత్రికల్లో అమ్మ వారసుడిగా తమిళ హీరో అజిత్ కుమార్ అయితే బాగుంటుందని అన్నాడీఎంకే కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అమ్మ స్థానంలో అజిత్ కుమార్‌ని నియమిస్తే అంతా బాగుంటుందని అంటున్నారు. ప్రస్తుతం అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో పన్నీరు సెల్వం ఇంఛార్జి ముఖ్యమంత్రిగా వ్యవహారిస్తున్నారు. పన్నీరు సెల్వం పట్ల పార్టీ అధినాయకత్వం నమ్మకంగా లేదని పార్టీ వర్గాల సమాచారం.
ఈ క్రమంలో హీరో అజిత్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే అజిత్‌కు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఇంత సడన్‌గా ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగిస్తే ఏ మేరకు రాణిస్తారోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర అధికార యంత్రాంగం మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తోంది. పాలనాపరంగా ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులతో పాటు జయలలిత మంత్రులు సైతం ఆమె సూచనల మేరకు నడుచుకుంటున్నారు.
2014లో షీలా బాలాకృష్ణన్ (62) తన సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఆమె నిజాయితీ, పని పట్ల దీక్షతను గుర్తించిన జయలలిత ఆమెను సలహాదారుగా నియమించుకున్నారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన అమ్మ ఆసుపత్రిలో చేరడంతో అమ్మ స్థానంలో పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications