వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర-ఒడిశా: ఆ ఊరి కోసం రెండు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు:వివాదానికి కారణమైన మాణిక్యపట్నంలోని మినీ అంగన్వాడీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సరిహద్దు వివాదాలున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఏజెన్సీలోని చాలా గ్రామాలతో ఒడిశాలోని కొరాపుట్, గజపతి జిల్లాలకు సరిహద్దు పంచాయితీలున్నాయి.

వివాదస్పద సరిహద్దు గ్రామాల్లో నివాసముంటున్న వారికి జీవితం దినదిన గండంగా మారుతోంది. దీనికి తాజా ఉదాహరణ శ్రీకాకుళం ఏజెన్సీలోని మాణిక్యపట్నం.

విశాఖ ఏజెన్సీలోని కొల్లాపుట్ పంచాయితీ, విజయనగరం జిల్లాలోని కొఠియా గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం సాబకోట పంచాయితీ మాణిక్యపట్నం గ్రామం కూడా సరిహద్దు వివాదంలో చేరింది.

ఈ ప్రాంతంలో బీబీసీ తెలుగు పర్యటించింది.

ఆంధ్రా, ఒడిశా మధ్యలో ఒక రోడ్డు...

శ్రీకాకుళం జిల్లాలో మందస మండలం సాబకోట పంచాయతీలోని మాణిక్యపట్నం ఒక గిరిజన గ్రామం. ఇది ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉంది. ఇది ఏపీ ప్రభుత్వ రికార్డులో మాణిక్యపట్నం అని ఉంది. ఇదే గ్రామాన్ని ఒడిశా కూడా తమ రికార్డుల్లో చూపిస్తోంది.

ఈ గ్రామం మధ్యలోంచి రోడ్డు ఉంది. రోడ్డు రెండు వైపులా గ్రామం ఉంది. రోడ్డుకు ఒక వైపు ఏపీ, మరోవైపు ఒడిశా అని సరిహద్దు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ రోడ్డుకు రెండు వైపుల ఉన్న భూభాగమంతా తమదేనంటూ ఒడిశా చెబుతుండడంతో వివాదం మొదలైంది.

"మా గ్రామంలో 43 ఇళ్లు ఉన్నాయి. 40 ఇళ్ల ప్రజలు ఏపీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. మిగతా మూడు కుటుంబాలే ఒడిశావాసులు.

పేరుకే వారు ఇక్కడి స్థానికులు. గ్రామంలో ఎప్పుడూ ఉండరు’’ అని మాణిక్యపట్నానికి చెందిన సవర ప్రధాన్ వెల్లడించారు. 50 ఏళ్ల ప్రధాన్ ఇక్కడే పుట్టి పెరిగారు.

'' సెప్టెంబర్ 5న ఒడిశా అధికారులు అకస్మాత్తుగా గ్రామంలోకి వచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మినీ అంగన్వాడీ కేంద్రం (దీనిపై మాణిక్యపురం అని రాసి ఉంటుంది) ఒడిశా భూభాగంలోనిదంటూ దానిని మూసివేయించారు.

వారిని అడ్డుకున్న అంగన్ వాడీ కార్యకర్త భర్తను అరెస్ట్ చేశారు. దాంతో గ్రామంలో ఉద్రికత్త నెలకొంది. అప్పట్నుంచి గ్రామంలోకి కొత్తవారెవరు వచ్చినా భయంగానే ఉంటోంది" అని సవర ప్రధాన్ బీబీసీతో చెప్పారు.

ఆంధ్రా, ఒడిశా రెండు రాష్ట్రాల కార్డులు, పధకాలు అందుకుంటున్న మాణిక్యపట్నం వాసులు

సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సర్వే చేసేవరకు..

అంగన్వాడీ కేంద్రం మూయించడం, ఒడిశా అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో మాణిక్యపట్నం గ్రామానికి రావడం...ఒకర్ని అరెస్ట్ చేయడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సరిహద్దు సమస్యపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠ్కర్‌, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కలెక్టర్‌ లింగరాజ్ పండా చర్చలు జరపడంతో సద్దుమణిగింది. సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు సరిహద్దు ప్రాంతాలను సర్వే చేసేంత వరకు మినీ అంగన్వాడీ కేంద్రాన్ని యాథావిధిగా నడపాలని నిర్ణయించారు.

ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేసిన మాణిక్యపట్నం అంగన్వాడీ కార్యకర్త భర్తను బెయిల్‌పై విడుదల చేశారు.

"వివాదాన్ని స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి మాణిక్యపట్నం వాసులు తీసుకుని వెళ్లారు. దాంతో సెప్టెంబర్ 8న మాణిక్యపట్నానికి మంత్రి సీదిరి అప్పలరాజు వచ్చారు. ఏపీ రెవెన్యూ అధికారులు మాణిక్యపట్నం ఏపీలో ఉందన్న రికార్డులను ఒడిశా అధికారులకు చూపించారు. కానీ ఒడిశా అధికారులు తమ వద్ద కూడా ఆధారాలున్నాయని, కానీ వాటిని చూపించాల్సిన అవసరం లేదని వాదించారు’’ అని సాబకోట మాజీ సర్పంచ్ రామారావు బీబీసీతో అన్నారు.

ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా ఏపీ భూభాగంలోకి వస్తే అరెస్టు చేయాలని మంత్రి అప్పలరాజు అధికారులను ఆదేశించినట్లు రామారావు వెల్లడించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్ధుల్లోని కొఠియా గ్రామాల్లోని రోడ్లు

ఈ గ్రామం ఎవరిది?

మాణిక్యపట్నం గ్రామం మాదంటే మాదని రెండు రాష్ట్రాలు గొడవపడుతున్నాయి. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఏముందనే విషయాన్ని తెలుసుకోవడానికి స్థానిక తహసీల్దార్ డి.పాపారావును బీబీసీ సంప్రదించింది.

"1959-60 రికార్డుల ప్రకారం సర్వే నంబరు 37లోని మాణిక్యపట్నం భూభాగమంతా ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుంది. ఆ రికార్డులు మా వద్ద ఉన్నాయి. మంత్రిగారి సమక్షంలో వాటిని ఒడిశా అధికారులకు చూపించాం కూడా. అయితే ఒడిశా అధికారులు మాత్రం 1994 ఒడిశా రికార్డుల ప్రకారం ఈ గ్రామం తమకు చెందుతుందంటున్నారు’’ అని పాపారావు తెలిపారు.

ఎవరి రికార్డులు సరైనవో తేలాలంటే ఏపీ, ఒడిశా రాష్ట్రాలు కలిసి సర్వే చేపట్టాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

మాణిక్యపట్నంలో మినీ అంగన్వాడీ కేంద్రం కోసం 2012లో రేకుల షెడ్‌ను ఆంధ్రా భూభాగంలో నిర్మించారని, ఇక్కడి గ్రామస్తులకు ఆంధ్రా చిరునామాతోనే ఆధార్‌, రేషన్‌ కార్డులున్నాయని తహసీల్దార్ పాపారావు తెలిపారు.

''ఒడిశా అధికారులు, పోలీసులు తరచూ గ్రామంలోకి వచ్చి స్థానికులను భయపెడుతున్నట్లు రిపోర్టు వస్తున్నాయి. ఒడిశాకు చెందిన అధికారులు సందర్శకుల్లా వచ్చి గ్రామంలో తిరుగుతున్నారు. గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు’’ అన్నారాయన.

ఇళ్లకు రెండు రాష్ట్రాలు ఇచ్చిన ఇంటి నెంబర్లు ఉంటాయి.

'సైట్ సీయింగ్'కు వచ్చాం

మాణిక్యపట్నం గ్రామంలో స్థానికుల లెక్క ప్రకారం 43 ఇళ్లే ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డుల్లో 65 ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది ఆంధ్రా భూభాగంలో ఉన్న మాణిక్యపట్నంలో నివసిస్తున్నవారే.

ఒడిశాలోని గజపతి జిల్లా పరిధిలో ఉన్న మాణిక్యపట్నలో తక్కువ మందే ఉంటున్నారు. బీబీసీ మాణిక్యపట్నం గ్రామంలో పర్యటించినప్పుడు ఒడిశాకు చెందిన సాహు అనే వ్యక్తి తప్ప స్థానికులైన ఒడిశా వాసులెవరూ కనిపించలేదు.

"మాది ఒడిశా. మేం ఇక్కడే ఉంటున్నాం. ఒడిశా రాష్ట్రంలోనే ఉండాలని అనుకుంటున్నాం" అని సాహు చెప్పారు.

అయితే మాణిక్యపట్నం ప్రాంతాన్ని గుంపులుగా ఒడిశా వాసులు సందర్శిస్తున్నారు. మీరంతా ఎవరని వాళ్లని బీబీసీ అడిగితే 'సైట్ సీయింగ్'కు వచ్చామని చెప్పారు.

ఈ గ్రామంలో ఏముంది చూడడానికంటే ఏదో గొడవ జరుగుతుందని తెలిసి చూడడానికి వచ్చామని చెప్పారు. అయితే వారంతా ఒడిశా ప్రభుత్వ అధికారులని, ప్రతి రోజూ ఇలా వస్తూనే ఉంటారని, ఒక్కోరోజు ఒక్కో బృందం వస్తుందని స్థానిక ఆంధ్రావాసులు అంటున్నారు.

సైట్ సీయింగ్‌కు వచ్చామంటూ ఒరిస్సా అధికారులు ఇక్కడికి వచ్చి పరిస్థితులను గమనిస్తుంటారు

సమస్య పరిష్కరించుకోవాలి: ఒడిశా అధికారులు

సరిహద్దు వివాదంతో ఇలా నిత్యం టెన్షన్ వాతావరణంలో గడుతుపుతున్న గ్రామం ఒక్క మాణిక్యపట్నం మాత్రమే కాదు. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మూడు జిల్లాలోని ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా విజయనగరం జిల్లా సరిహద్దులోని కొఠియా గ్రామాలు.

విశాఖపట్నం ఏజెన్సీలోని కొల్లాపుట్, శ్రీకాకుళం మన్యంలోని సాబకోట పంచాయితీలకు ఒడిశాలోని కొరాపూట్, గజపతి జిల్లాలతో సరిహద్దు వివాదాలున్నాయి. వివాదాలున్న కొన్ని గ్రామాల్లో ఒడిశా రాష్ట్ర రెవన్యూ సెక్రటరీ బిష్ణుపాద సేథీ ఇటీవల పర్యటించారు.

"ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య చాలాచోట్ల సరిహద్దు వివాదాలున్నాయి. వీటి వలన స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రెండు రాష్ట్రాల నుంచి పథకాలు, సౌకర్యాలు పొందుతున్నారు. రెండు రాష్ట్రాలు కూడా వివాదస్పద గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాలు ఒకేచోట తమ నిధులను, వనరులను ఖర్చు చేయడం సరైనది కాదు’’ అని బిష్ణుపాద అన్నారు.

వీటిపై కోర్టుల్లో కేసులున్నాయని, వివాదస్పద గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.

తూర్పు కొండల్లోని ఖనిజాల కారణంగానే రెండు రాష్ట్రాలు గ్రామాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తూర్పు కొండల్లో ఏముంది...

వివాదస్పద గ్రామాలు సాధారణంగా అభివృద్ధికి దూరంగా ఉంటాయి. కానీ ఆంధ్రా, ఒడిశా వివాదస్పద గ్రామాల్లో మాత్రం రెండు ప్రభుత్వాలు పోటాపోటిగా అభివృద్ధి పనులు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు అందించడం చేస్తున్నాయి.

"ఈ వివాదస్పద గ్రామాలన్ని తూర్పు కనుమల్లో ఉన్నాయి. ఇక్కడ రెండు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి.

కనీసం రోడ్డైనా వస్తుందా అనుకునే గిరిజన గ్రామాలకు నగరాల్లో కూడా లేనంత అద్భుతమైన రోడ్లు వేశారు.

దీనికి విజయనగరం జిల్లాలోని కొఠియా గ్రామాలే మంచి ఉదాహరణ. అయితే తూర్పు కనుమల్లో మారుమూల విసిరేసినట్లు ఉండే ఈ ప్రాంతాలపై ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధికి అక్కడున్న ఖనిజ సంపదే కారణమై ఉంటుంది.

వీటిని పొందేందుకు స్థానిక ప్రజల మద్ధతు కూడగట్టేందుకు ఈ కొండల్లో కూడా ప్రభుత్వాలు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండవచ్చు" అని ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డి. రాజశేఖరరెడ్డి తెలిపారు.

గిరిశిఖ గ్రామాల్లో పాలిటిక్స్

ఒడిశా, ఆంధ్రా సరిహద్దు వివాదాలున్న గ్రామాలు సగటున సముద్రమట్టానికి 3,000 అడుగుల ఎత్తున ఉన్నవే. ఇక్కడ కూడా రోడ్లు వేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఈ గ్రామాల్లో సైతం కేంద్ర, రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు పర్యటనలు చేస్తున్నారు. దీంతో అక్కడున్న స్థానికులు సైతం పార్టీలుగా విడిపోతున్నారు.

ఏపీలో జరిగిన పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఇది కనిపించింది. వివాదస్పద సరిహద్దు గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల నుంచి ఓటరు కార్డులుంటాయి.

"ఏపీలో జరిగిన పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయకూడదంటూ ఒడిశా అధికారులు (కొఠియా, మాణిక్యపట్నం ఓటర్లను) హెచ్చరించారు. ఓటు వేస్తే కేసులు నమోదు చేస్తామని భయపెట్టారు. మాట వినని వాళ్లపై ఏదో ఒక కేసులు పెట్టడం, పథకాలను నిపులు చేయడం చేస్తున్నారు. అలాగే ఒడిశా పథకాలను అందుకోవద్దంటూ కూడా ఆంధ్రా అధికారులు చెప్తున్నారు. రెండు రాష్ట్రాలు బాగానే చూసుకుంటున్నప్పుడు, ఒక రాష్ట్రానికే ఎందుకు పరిమితం కావాలన్నది స్థానికుల్లో కొందరి వాదన. కానీ ఈ రాజకీయాలు చూస్తుంటే ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కావాల్సి వస్తున్నట్లు ఉంది" అని కొఠియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు గ్రామానికి చెందిన పీజీ విద్యార్ధి సట్టుభద్ర తెలిపారు.

సరిహద్దు 'పంచాయితీ'కి పరిష్కరం లేదా

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు వివాదాలకు సంబంధించిన వాటిలో కొఠియా గ్రామాల వివాదం అన్నింటి కంటే పెద్దది.

దీనికి ఒక పరిష్కారం దొరికితే, మిగతా గ్రామాలకు, ప్రాంతాలకు ఇదే పరిష్కారంగా మారుతుందని కొఠియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు బీబీసీతో చెప్పారు.

"1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించేందుకు గిల్.జి అనే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహించారు. ఇందులో ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా.కొన్ని గ్రామాల సంగతి తేల్చలేదు. అవే ఇవి’’ రాజు వెల్లడించారు.

కొఠియా గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్ కో విధించిందని, దీంతో ఇప్పటికీ పరిష్కారం లభించలేదని రాజు వెల్లడించారు. ఈ కేసులో తీర్పు వస్తే మొత్తం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల సమస్యకు పరిష్కరం లభించినట్లేని ఆయన అన్నారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాలలో ఒకటి

ఆంధ్రప్రదేశ్ సీఎంకు కేంద్ర మంత్రి లేఖ...

ఏపీ, ఒడిశా సరిహద్దుల మధ్య వివాదాల పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ చొరవ చూపాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు.

"ఆంధ్రా, ఒడిశా ఒకే రకమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. సరిహద్దు వివాదాల వలన అనిశ్చతి పెరిగి అసాంఘిక శక్తులకు చోటు దక్కే అవకాశం ఉంటుంది. అందుకే సరిహద్దు వివాదాల్ని వెంటనే పరిష్కరించుకోవాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, ఇతర అధికారులు చర్చలు జరిపి తక్షణం ఈ సమస్యను పరిష్కరరించుకోవాలి’’ అని ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.

ఒక ఒడిశావాసిగా వివాదాస్పద సరిహద్దు గ్రామాల అవస్థలను చూడలేకపోతున్నానని, పరిష్కారానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Why AP and Odisha fighting for that village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X