ఆ కేంద్రమంత్రిపై చర్యలేవి? ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేయరా?: మోడీకి ప్రియాంక గాంధీ ప్రశ్న
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్రమంత్రి కాన్వాయ్ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మృతి చెందిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని, కేంద్రమంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులపైకి దూసుకెళ్లిన వాహనంకు సంబంధించిన వీడియోను చూపిస్తూ ప్రియాంక గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మరణాలకు కారణమైన కేంద్రమంత్రిని ఇప్పటి వరకు తొలగించలేదని, కేంద్రమంత్రి కుమారుడిని అరెస్ట్ కూడా చేయలేదని అన్నారు.

అంతేగాక, రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రైతుల మరణాలకు కారణమైనవారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
లక్నోలో నిర్వహించిన ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. రైతుల సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ. గత కొద్ది నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని ఒకసారి లఖింపూర్ ఖేరీకి రావాలని ఆమె కోరారు. దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, తనను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎఫ్ఐఆర్ కూడా లేకుండా తనను నిర్బంధించారని ప్రియాంక గాంధీ తెలిపారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై నిరసన తెలిపేందుకు వచ్చిన ప్రియాంకను సీతాపూర్ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆమెను ఓ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించారు. వెంటనే ప్రియాంకను విడుదల చేయాలని సీతాపూర్ గెస్ట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రియాంక గాంధీని నిజమైన కార్యకర్త అంటూ రాహుల్ గాంధీ కొనియాడారు. ఆమె తన సత్యాగ్రహాన్ని ఆపబోరని వ్యాఖ్యానించారు.
Recommended Video
కేంద్రమంత్రి కాన్వాయ్ వాహనం రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలుపుతున్నారు. కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబానికి రూ. 45 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications