రాజస్తాన్ లో మాత్రమే బీజేపీ గెలుస్తోందా ? మిగతా రాష్ట్రాల్లో నిరాశ తప్పదా !
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు అసలైన సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చావోరేవోగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో తాము గెలిచినా, గెలవకపోయినా కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడటం ఖాయంగా భావిస్తున్న కాషాయ దళం.. ఇప్పుడు తాము అస్సలు గెలిచే అవకాశాలు లేని తెలంగాణ, మిజోరం వంటి చోట మిత్రులకు మద్దతుగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ జాతీయ న్యూస్ వెబ్ సైట్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో విశ్లేషించారు.
ఈ నెల మొదటివారంలో ఛత్తీస్ ఘడ్ లో తొలి దశ, మిజోరం ఎన్నికలు పూర్తయ్యాయి. అలాగే వచ్చే మూడు వారాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్ రెండో దశ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వీటిలో బీజేపీకి రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ కీలకమే. తెలంగాణలో ఈసారి గెలుపు అవకాశాలు లేవని తేలిపోవడంతో బీజేపీ పరిస్ధితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అయితే గెలుపు అవకాశమున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో పరిస్ధితుల్ని ఓసారి గమనిస్తే తాజా రాజకీయం అర్ధమవుతుంది.

ప్రాంతీయ పార్టీల హవా ఉండే మిజోరంతో పాటు తెలంగాణలో బీజేపీకి అధికారం కష్టమని తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ అన్నీ కలిసి కట్టుగా తేల్చేశాయి. ఇప్పుడు బీజేపీకి కాస్తో కూస్తో గెలుపు అవకాశాలున్న మూడు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కేవలం రాజస్తాన్ లో మాత్రమే బీజేపీ గెలిచే పరిస్ధితులు ఉన్నట్లు టీఎంసీ ఎంపీ, కాలమిస్ట్ డెరెక్ ఓబ్రెయిన్ విశ్లేషించారు. మిగతా రెండు రాష్ట్రాల్లో అంటే ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ గెలుపు కోసం నిజాయితీగా పోరాడుతున్న మూడు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలనో, మోడీ ఛరిష్మానో నమ్ముకోవాల్సిన పరిస్దితులు ఉన్నాయి. అయితే బీజేపీయర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా పథకాలు ఇప్పటికే అమలవుతుండటం, బీజేపీ కంటే ముందే ప్రాంతీయ పార్టీలో, కాంగ్రెస్సో వాటిని అమలు చేస్తుండటంతో వాటికి ఆదరణ ఎక్కువగా ఉందని ఓబ్రెయిన్ తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ముచేసుకుంటోందని, ఛత్తీస్ ఘడ్ లో అదే వ్యతిరేకతను కాంగ్రెస్ అధిగమిస్తుందనే ఒపీనియన్ పోల్స్ అంచనాలు బీజేపీకి షాకింగ్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications