వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ సైజులో ఉండే వడగండ్లు పడటం ఇక సాధారణంగా మారుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వడగండ్లు

స్పెయిన్‌లోని కాటలోనియాలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భీకర వడగండ్ల వాన కారణంగా 20 నెలల పసిబిడ్డ మృత్యువాతపడ్డారు.

ఒక భారీ మంచుగడ్డ, బాలుడి తలకు తగలడంతో ఆ చిన్నారి మరణించారు.

ఈ వడగండ్ల వానలో కురిసిన కొన్ని మంచుగడ్డలు 10 సెం.మీ వ్యాసంతో ఉన్నాయి. వీటి వల్ల ఇంటి పైకప్పులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి.

కాటలోనియాలోని గిరోనా ప్రావిన్సులో 10 నిమిషాల పాటు కురిసిన ఈ వర్షం కారణంగా డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

వడగండ్ల వానలు తరచుగా ఎందుకు కురుస్తున్నాయో వివరిస్తూ బీబీసీ ఫ్యూచర్ ప్రతినిధి డేవిడ్ హాంబ్లింగ్ ఈ కథనాన్ని అందించారు.


ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌షైర్‌లో 2021 జూలై 21 సాయంత్రం వేళలో అకస్మాత్తుగా గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న వడగండ్లు కురిశాయి. కుండపోతగా కురిసిన ఈ మంచు వాన కారణంగా ఇళ్ల కిటికీలు, కార్లు, గార్డెన్లకు తీవ్ర నష్టం కలిగింది.

ఇంత తీవ్ర స్థాయిలో వడగండ్లు కురవడం చాలా అసాధారణ విషయం. కానీ, 2020 జూన్‌ నెలలో కెనడాలోని కాల్గరీలో కురిసిన వడగండ్ల వానతో పోలిస్తే దీన్ని తేలికైన వానగానే పరిగణించవచ్చు.

కాల్గరీలో టెన్నిస్ బంతుల పరిమాణంలో కురిసిన వడగండ్ల కారణంగా కనీసం 70 వేల ఇళ్లు, వాహనాలు, పంటలు నాశనమయ్యాయి. రూ. 7,508 కోట్ల నష్టం వాటిల్లింది.

20 నిమిషాల పాటు కురిసిన ఈ భీకర వాన... కెనడాలో అత్యంత నష్టాన్ని కలిగించిన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటిగా నిలిచింది.

వాతావరణ మార్పుల వల్ల వడగండ్ల వానలు కురిసే తీరులో కూడా మార్పులు వస్తున్నాయి.

టెక్సస్, కొలరెడో, అలబామాలో గత మూడేళ్లలో దాదాపు 16 సెం.మీ వ్యాసంతో కూడిన వడగండ్లు కూడా కురిశాయి. అక్కడ అతిపెద్ద వడగండ్లకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటాయి.

లిబియా రాజధాని ట్రిపోలీలో 2020లో దాదాపు 18 సెం.మీ వ్యాసం ఉన్న వడగండ్లు కురిశాయి.

అసలు వడగండ్లు పరిమాణంలో ఎంత వరకు పెరగొచ్చు? వీటి పరిమాణానికి హద్దులు ఉంటాయా?

ఆకాశం నుంచి మంచు ఎక్కువగా కురవడానికి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు కారణం అవుతుంది?

వడగండ్ల వల్ల ద్వంసం అయిన కారు

బరువు, పరిమాణం, వేగం

వాతావరణంలోకి చేరే నీటి బిందువుల వల్ల వడగండ్లు ఏర్పడతాయి. పైకి వీచే బలమైన గాలుల వల్ల నీటి బిందువులు వాతావరణ పైపొరలకు చేరతాయి. అక్కడ వాతావరణం నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది. ఈ స్థితిలో నీటి బిందువులు మంచుగా మారతాయి. గాలిలోని తేమ, ఈ మంచు చుట్టూ పేరుకుపోతున్నకొద్దీ వీటి పరిమాణం పెరుగుతుంది.

వడగండ్ల పరిమాణం ఎంత వేగంగా పెరుగుతుందనేది గాలిలోని తేమపై ఆధారపడి ఉంటుంది. బలమైన గాలులు పైకి వీచినంతకాలం వీటి పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. గాలి బలహీనపడినప్పుడు ఈ వడగండ్లు కిందపడతాయి.

యూఎస్ నేషనల్ ఒషియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్నదాని ప్రకారం, గంటకు 103 కి.మీ వేగంతో పైకి వీచే బలమైన గాలి ప్రవాహాలు, గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉండే వడగండ్లు ఏర్పడటానికి సహాయపడతాయి. ఈ గాలి వేగం మరో 27 శాతం పెరిగితే బేస్ బాల్ పరిమాణంలో ఉండే వడగండ్లు తయారవుతాయి.

ఎక్కువగా తేమ ఉండే గాలి, ఎక్కువ శక్తిమంతమైన గాలి ప్రవాహాల వల్ల మరింత పెద్దగా ఉండే వడగండ్లు ఏర్పడతాయి.

వడగండ్లు

ప్రత్యేక వాతావరణ పరిస్థితులు అవసరం

25మి.మీ వ్యాసార్థానికి పైగా ఉన్న వడగండ్లను కురిపించే విధ్వంసకర తుపానులకు ఒక నిర్దిష్ట వాతావరణ పరిస్థితులు అవసరం అవుతాయని కెనడాలోని ఇన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ విభాగానికి చెందిన ఫిజికల్ సైన్సెస్ స్పెషలిస్ట్ జులియన్ బ్రైమ్‌లో చెప్పారు.

ఇలాంటి తుపానులకు తగినంత తేమ, శక్తిమంతమైన గాలి ప్రవాహాలు, ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవసరం.

అందుకే భీకరమైన వడగండ్ల వానలు సాధారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. అమెరికాలోని మైదానాలు, ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లలో ఇవి ఎక్కువగా కురుస్తాయి.

ఈ రీజియన్‌లలో వెచ్చని, తేమతో కూడిన గాలి కంటే ఎగువ వాతావరణంలో చల్లని, పొడి గాలి పరుచుకుని ఉంటుంది. ఇలాంటి అస్థిరమైన వాతావరణ పరిస్థితులు పటిష్టమైన గాలి ప్రవాహాలకు, భారీ తుపానులకు కారణం అవుతాయి.

ఈ ప్రాంతాలు 'సూపర్‌సెల్స్' అని పిలిచే ఒక రకమైన తుపానులకు గురవుతాయి. ఈ తుపానులు భారీ స్థాయిలో ఉండే వడగండ్లను సృష్టిస్తాయి.

వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. అలాగే గాలిలోని తేమను కూడా వాతావారణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూమి ఉపరితలం నుంచి నీరు ఎక్కువగా ఆవిరి అవుతోంది. వెచ్చని గాలిలో ఎక్కువ నీటి ఆవిరి ఉంటుంది.

దీనివల్లే ప్రపంచంలోని కొన్ని భాగాల్లో భీకర తుపానులు, భారీ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు.

''భూగ్రహం వేడెక్కడం ఇలాగే కొనసాగితే, వడగండ్లు తరచుగా కురిసే ప్రాంతాలు మారుతుంటాయి. ఇప్పుడు పరిమితంగా తేమను కలిగి ఉండే ప్రాంతాల్లో తేమ శాతం పెరిగిపోవచ్చు. ఫలితంగా వడగండ్లు తరచుగా కురిసే అవకాశం పెరుగుతుంది'' అని బ్రైమ్‌లో చెప్పారు.

వడగండ్లు

తీవ్రత

ఇప్పటికే జరుగుతున్న వాతావరణ మార్పులను పరిశీలించిన పరిశోధకులు.. ఆస్ట్రేలియా, యూరప్‌లో వడగండ్లు తరచుగా కురుస్తాయని నిర్ధారించారు.

తూర్పు ఆసియా, ఉత్తర అమెరికాలో వడగండ్ల వానలు కురవడంలో తగ్గుదల ఉంటుందని చెప్పారు. కానీ వడగాలులు అనేవి మరింత తీవ్రంగా మారుతాయని వారు కనుగొన్నారు. ఉత్తర అమెరికాలో కురిసే వడగండ్ల పరిమాణం మాత్రం పెద్దగా ఉండే అవకాశం ఉందని అన్నారు.

''ఫ్రాన్స్‌లోని వడగండ్ల డేటా చూసుకుంటే, వడగండ్ల పరిమాణంలో మార్పు ఉన్నట్లు తెలుస్తుంది'' అని బ్రైమ్‌లో అన్నారు.

వడగండ్ల వాన

సాంద్రత

వడగండ్ల వల్ల ప్రతీ ఏటా కలిగే నష్టం కూడా పెరుగవచ్చని బ్రైమ్‌లో చెప్పారు. అయితే, ఏ ప్రాంతాల్లో వీటి వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందో చెప్పడం కష్టమని అన్నారు.

గాలిలోని తేమ, ఉష్ణోగ్రతలు వడగండ్ల సాంద్రతపై ప్రభావం చూపిస్తాయి. చల్లటి గాలిలో నీటి బిందువులు చాలా త్వరగా వడగండ్లుగా మారతాయి.

నీటి బిందువులు గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందంటే అర్థం అక్కడ గాలి కాస్త వెచ్చగా ఉన్నట్లు లేదా గాలిలో ఎక్కువ మొత్తంలో తేమ ఉన్నట్లు.

చల్లని గాలిని తాకగానే ఎక్కువ పరిమాణంలో ఉన్న తేమ మొత్తం ఉన్నపళంగా మంచుగా మారదు. అందులోని కొన్ని నీటి బిందువులు, మంచుగా మారకుండా తప్పించుకుంటాయి.

పరిమాణంలో చిన్నగా ఉండే వడగండ్ల సాంద్రత దట్టంగా ఉండదు.

సంక్లిష్టమైన మంచు పొరలతో భారీ పరిమాణంలో ఉండే వడగండ్లు ఏర్పడతాయి. వీటి సాంద్రత దట్టంగా ఉంటుంది.

తుపాను

కేజీకి పైగా బరువు

వడగండ్ల సాంద్రత కూడా వాటి పరిమాణంపై ప్రభావం చూపుతుంది. ఇది ఎంత భారీగా ఉంటే, అంత త్వరగా, వేగంగా కిందపడిపోయే అవకాశం ఉంటుంది.

1986లో బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో బరువైన వడగండ్లు కురిశాయి. వాటి బరువు 1.02 కేజీలుగా ఉంది. ఇప్పటి వరకు ఇవే అత్యంత బరువైన వడగండ్లుగా రికార్డులకెక్కాయి.

ఆ సమయంలో వచ్చిన నివేదికల ప్రకారం ఈ అతిభారీ వడగండ్ల వాన కారణంగా 40 మంది మరణించారు. 400 మంది గాయపడ్డారు. కానీ, ఈ విపత్తులో 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తర్వాతి నివేదికలు సూచించాయి.

వడగండ్లు గరిష్టంగా ఎంత పెద్దగా ఏర్పడగలవు?

మోడలింగ్ సిములేషన్స్ డేటా ప్రకారం వడగండ్లు గరిష్టంగా 27 సెం.మీ వరకు ఉండే అవకాశం ఉందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ నిపుణుడు మ్యాథ్యూ కుమియాన్ అంచనా వేశారు. అంటే ఇవి ఫుట్‌బాల్ పరిమాణం కంటే కూడా పెద్దగా ఉంటాయి.

అయితే, ఇప్పటివరకు ఈ స్థాయిలోని వడగండ్లు ఎక్కడా కురిసిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. ఇంత పెద్ద వడగండ్లు తయారు అవ్వాలంటే అత్యంత బలమైన గాలి ప్రవాహాలు, పుష్కలంగా సూపర్‌కూల్డ్ లిక్విడ్ వాటర్‌తో పాటు అందుకు తగిన వాతావరణ పరిస్థితులు ఉండాలని ఆయన వివరించారు.

''ఇప్పటికే సూపర్‌సెల్ తుపానుల్లో కురిసే వడగండ్లలో ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం సంభవిస్తోన్న తుపానుల్లో అత్యంత శక్తిమంతమైన తుపాను, సూపర్ జెయింట్ వడగండ్లను సృష్టించగలదు'' అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will hailstones the size of cricket balls and tennis balls become more common?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X