యూపీలో యోగీ "టిఫిన్ పే చర్చ"- మోడీ నాయకత్వంపై ప్రశంసల జల్లు..
ప్రధాని మోడీ చాయ్ పే చర్చా తరహాలో యూపీలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ టిఫిన్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యూపీ బీజేపీ యూనిట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో యోగీ ఆదిత్యనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ నాయకత్వంపై యోగీ ప్రశంసలు కురిపించారు. మోడీ పనితీరు కారణంగా అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్టలు పెరుగుతన్న వైనాన్ని యోగీ గుర్తుచేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ మహా సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన 'టిఫిన్ పే చర్చ' కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. గోరఖ్‌పూర్‌లో పార్టీ సీనియర్ కార్యకర్తలను ఉద్దేశించి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వం కారణంగా భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నారు.

మనం సొంత విజయాల గురించి మాట్లాడినప్పుడు దానికి పెద్దగా అర్ధం ఉండదని, కానీ ప్రపంచం మన పనిని గుర్తించినప్పుడు, అది నిజమైన గౌరవమని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. 2014కి ముందు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క స్థానం అందరికీ తెలుసన్నారు. మోదీ నాయకత్వంలో వచ్చిన సానుకూల మార్పులను దేశమే కాదు, ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. సంక్షోభ సమయాల్లో ప్రపంచం భారత్ వైపు, ప్రధాని వైపు ఆశగా చూస్తుందని సీఎం గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్లను పురస్కరించుకుని నెల రోజులుగా జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలను ఆదిత్యనాథ్ కోరారు.
కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత యోగీ ఆదిత్యనాథ్ టిఫిన్ బాక్స్ తెరిచి, వారి వ్యక్తిగత టిఫిన్లను కూడా తీసుకువచ్చిన పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. 'చాయ్ పే చర్చా' కార్యక్రమం తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఇటీవల 'టిఫిన్ పే చర్చా' ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి సొంత టిఫిన్లు తెచ్చుకుని కలిసి తింటారు.












Click it and Unblock the Notifications