షాక్: అంత్యక్రియలకు తరలిస్తుంటే.. పాడె మీంచి లేచి కూర్చున్నాడు..
తీరా స్మశానానికి తీసుకెళ్లే క్రమంలో.. మార్గమధ్యలో పాడె మీద నుంచి అతను లేచి కూర్చున్నాడు.
ధార్వాడ్: కుక్క కాటు అతని ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఒళ్లంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో పరిస్థితి విషమిచింది. వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందించినా.. దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులకు ఆ ఖర్చులను భరించడం కష్టంగా మారింది.
డాక్టర్లు సైతం బతుకుతాడన్న నమ్మకం లేదని తేల్చేశారు. దీంతో అతన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతని శ్వాస ఆగిపోవడంతో.. అంతా అతను మరణించాడనే అనుకున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. తీరా స్మశానానికి తీసుకెళ్లే క్రమంలో.. మార్గమధ్యలో పాడె మీద నుంచి అతను లేచి కూర్చున్నాడు.

దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కర్ణాటకలోని ధార్వాడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కుమార్ మారేవాడ్(17)కు ధార్వాడ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే బ్రతికే అవకాశాలు లేవని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు.
ఇంటికెళ్లాక అతను మరణించడంతో స్మశానానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర మొదలై 2కి.మీ వెళ్లాక ఉన్నట్లుండి ఒక్కసారిగా కుమార్ లేచి కూర్చున్నాడు. దీంతో గోకుల్ రోడ్డులోని ఓ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు మెనింగోఎన్ సెఫలైటిస్ తో బాధపడుతున్నట్లు తాము భావిస్తున్నామని, కుక్క కాటు వల్ల అతనికి ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు.












Click it and Unblock the Notifications