చైనా చేతికి 22 కోట్ల మంది అమెరికన్ల గుట్టు: హుటాహుటిన జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. తన శత్రుదేశం చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఎన్నికల వ్యవస్థను పరోక్షంగా చైనా నియంత్రిస్తోందని విమర్రశించారు. విదేశీ శక్తుల జోక్యం, జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై ఆయన చేసిన ప్రకటనలు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేశాయి. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న భారీ సైబర్ ముప్పును బహిర్గతం చేసేందుకు 2020 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఉన్న ఇంటెలిజెన్స్ నివేదికలను ప్రభుత్వం డీక్లాసిఫై చేసినట్లు ప్రకటించారు. వాటన్నింటినీ దేశ ప్రజల ముందు ఉంచినట్లు వెల్లడించారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమ దేశ ఎన్నికల వ్యవస్థను అంతర్గతంగా దెబ్బతీసేందుకు చైనా పెద్ద ఎత్తున ప్రయత్నించిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా చోరీ వెనుక చైనా హస్తం ఉందని స్పష్టం చేశారు. సుమారు 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరించిందని, దాని ద్వారా తమను శాసించే స్థాయికి ఎదుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

2020 ఎన్నికల సమయం నుండి చైనా ఈ డేటాను సేకరిస్తోందని, ఈ ఏడాది జూన్ వరకూ పూర్తి డేటా వారి చేతుల్లో పడిందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా చేతికి చిక్కిన సమాచారంలో అమెరికా ఓటర్ల పేర్లు, నివాస చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి రాజకీయ పార్టీల ప్రాధాన్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సున్నితమైన సమాచారాన్ని ఉపయోగించి అమెరికా ఎన్నికలలో జోక్యం చేసుకోవడం, నకిలీ ఓటర్ల నమోదు వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పూనుకుందని విమర్శించారు.
ఇది తమ దేశ భద్రతకు ఓ పీడకలగా మారిందని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా చోరీ వ్యవహారంలో మొత్తం అయిదు ప్రధాన ఆందోళనకర అంశాలు ఉన్నాయని తెలిపారు. దీనికోసం చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ డేటా ఎక్స్‌ప్లాయిటేషన్ యూనిట్ ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ విభాగం నిరంతరం అమెరికా ఎన్నికల డేటాను విశ్లేషించిందని, దానిని తన రాజకీయ ప్రయోజనాల కోసం మలచుకోవడానికి ప్రయత్నించిందని ధ్వజమెత్తారు.
అమెరికా ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరిచేందుకు చైనా ఒక నిర్దుష్ట పథకం ప్రకారం వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు ప్రతినిధులు దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ట్రంప్ మండిపడ్డారు. తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలోని అత్యంత ప్రముఖులు, డీప్ స్టేట్ శక్తులు చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కేశారని ఆరోపించారు.
ఈ తీవ్ర ఉల్లంఘనల గురించి అమెరికా అప్పటి అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రజలకు అసలు సమాచారం తెలియకుండా చాలా అప్రజాస్వామ్య పద్ధతిలో దాచిపెట్టారని ట్రంప్ విమర్శించారు. అమెరికా ప్రభుత్వ అంతర్గత విభాగాల్లో ఉన్న ఈ లొసుగులను ఈ ఆరోపణలు ఎత్తిచూపినట్టయింది. ఈ స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో ఓటర్ల డేటా చైనా చేతికి చిక్కడం అనేది అమెరికా చరిత్రలోనే మొదటిసారి. అమెరికా-చైనా మధ్య ఇప్పటికే దెబ్బతిన్న దౌత్య సంబంధాలను ఈ వివాదం మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications