6 వేల జింకల అస్థిపంజరాలు. 37 ఏళ్లలో నాశనమైన రాక్షస సామ్రాజ్యం!
అది రెండో ప్రపంచ యుద్ధం పీక్ లో ఉన్న కాలం.. అలస్కా తీరానికి సుమారు 200 మైళ్ల దూరంలో ఉన్న 'సెయింట్ మాథ్యూ' అనే ఒక మారుమూల దీవి. అక్కడ విధులు నిర్వర్తించే అమెరికన్ కోస్ట్ గార్డ్ సైనికుల కోసం ఆ అత్యవసర ఆహారం కింద కేవలం 29 'రైన్‌డీర్' (ఒక రకమైన మంచు జింకలు) జాతి జంతువులను 1944లో ఆ దీవిలోకి తీసుకెళ్లారు. కానీ యుద్ధం ముగియడంతో సైనికులు ఆ దీవిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆ జింకలను అక్కడే వదిలేశారు. శత్రువులు లేరు.. వేటాడే మనుషులు లేరు.. ఇక అక్కడ ఆ జింకలకు తిరుగే లేకుండా పోయింది.
32 మైళ్ల పొడవు ఉండే ఆ చిన్న దీవిలో జింకలకు ఇష్టమైన 'లైకెన్' అనే మంచు గడ్డి విపరీతంగా పెరిగి ఉంది. వేటాడే జంతువులు ఏవీ లేకపోవడంతో ఆ 29 జింకల సంతతి రాకెట్ వేగంతో పెరిగింది. 1957 నాటికి వాటి సంఖ్య 1,300 దాటింది. మరో ఆరేళ్లలోనే, అంటే 1963 నాటికి ఆ చిన్న దీవిలో ఏకంగా 6,000 జింకలు గుంపులు గుంపులుగా తిరగడం ప్రారంభించాయి. ఒక చదరపు మైలుకు దాదాపు 47 జింకలు చేరడంతో, దీవిలో ఉన్న ఆహారం మొత్తాన్ని అవి నమిలేశాయి. పరిమితికి మించిన జనాభాతో ఆ దీవి వనరులన్నీ క్షీణించిపోయాయి.

ప్రకృతి సృష్టించిన బీభత్సం: ఒకే శీతాకాలంలో సర్వనాశనం!
సరిగ్గా అదే సమయంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. 1963-64 శీతాకాలంలో ఆ దీవిలో మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో కూడిన భయంకరమైన మంచు తుఫాన్లు విరుచుకుపడ్డాయి. అప్పటికే ఆహారం దొరక్క బలహీనపడిన ఈ జింకలు, మంచు గడ్డల కింద ఉన్న కొద్దిపాటి గడ్డిని కూడా తవ్వలేకపోయాయి.
ఫలితంగా వేలాది జింకలు ఆకలితో అల్లాడి చనిపోయాయి. 1966 లో శాస్త్రవేత్తలు వెళ్లి చూసేసరికి 6 వేల జనాభా ఉన్న చోట కేవలం 42 జింకలు మాత్రమే మిగిలాయి. అందులోనూ ఒక్కటే మగ జింక ఉండటం, అది కూడా పునరుత్పత్తికి పనికిరాకపోవడంతో వాటి సంతతి శాశ్వతంగా అంతరించిపోయింది. 1981 లో చివరి ఆడు జింక కూడా చనిపోవడంతో ఆ కథ ముగిసింది.
ప్రకృతి నేర్పిన పాఠం: సమతుల్యత లేకపోతే మనుగడే లేదు!
ప్రకృతిలో శత్రువులు లేకపోవడం తాత్కాలికంగా మంచిదే అనిపించినా, ఆహార వనరులను మించి జనాభా పెరిగితే ఎలాంటి ముప్పు ఎదురవుతుందో చెప్పడానికి ఈ సెయింట్ మాథ్యూ దీవి ఒక చేదు నిజంగా నిలిచింది. తిండి దొరక్క తమకు తామే వినాశనం వైపు అడుగులు వేసి, చివరికి ప్రకృతి వైపరీత్యానికి బలైపోయిన ఈ జింకల కథ పర్యావరణ సమతుల్యత ఎంత ముఖ్యమో ప్రపంచానికి ఘాటుగా గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ దీవిలో సైలెంట్‌గా మంచు పక్షులు, నక్కలు మాత్రమే జీవిస్తున్నాయి.














Click it and Unblock the Notifications