Mexico News: దేశాలు దాటేందుకు దొడ్డి దారులు.. పొట్టకూటి కోసం పోయి ప్రాణాల మీదకు..
Migrants News: భౌగోళిక, ఆర్థిక కారణాల రీత్యా ప్రజలు ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. సంపాదన కోసం భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారు కొందరుండగా, అక్రమంగా ఆయా దేశాల్లో ప్రవేశించి స్థిరంగా అక్కడే ఉండిపోవాలని అడ్డదారులు తొక్కేవారు మరికొందరున్నారు. ఈ తరహా ప్రయత్నాలు ప్రమాదం అని తెలిసినా మొండిగా ప్రయత్నించి ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా మెక్సికోలో జరిగింది.
గ్వాటెమాలాతో తమ దేశ సరిహద్దు సమీపంలో మెక్సికో సైనికులు ఓ ట్రక్కుపై కాల్పులు జరిపారు. దీంతో కనీసం 6 వలసదారులు మరణించారని మెక్సికో రక్షణ శాఖ ప్రకటించింది. ట్రక్కులోని వ్యక్తులు అక్రమ చొరబడటుకి ప్రయత్నించిన క్రమంలో చియాపాస్ వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సైనికులు తెలిపారు. దీంతో భారత్, పాకిస్తాన్ సహా ఈజిప్ట్, నేపాల్ మరియు క్యూబా వలసదారులు ప్రయాణిస్తున్న వాహనంపై ఇద్దరు సైనికులు తూటాల వర్షం కురిపించారు.

ఘటన తర్వాత సైనికులు నలుగురు మృతదేహాలను కనుగొన్నారు. 12 మంది గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులలో ఇద్దరు గాయాలతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. అయితే సైనికుల చర్య వల్ల ఆరుగురు వలసదారులు మరణించినట్లు, 10 మంది గాయపడినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. మొత్తం 33 మంది వలసదారులలో 17 మంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
వలసదారులను స్మగ్లింగ్ చేయడానికి సంఘటన జరిగిన ప్రదేశం ఒక సాధారణ మార్గమని మెక్సికో రక్షణ శాఖ చెబుతోంది. సరుకు రవాణా ట్రక్కులలో అక్రమ చొరబాట్లకు ప్రయాణిస్తారని పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇద్దరు సైనికులను విధుల నుంచి తప్పించారు. అయితే 2021లో కూడా ఇక్కడ ఇదే తరహా ఘటన జరిగింది. వలసదారులను తీసుకెళ్తున్న వాహనంపై క్వాసీ మిలిటరీ నేషనల్ గార్డ్ కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు మరో నలుగురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications