అనూహ్య సంఘటన: నడిరోడ్డుపై నిలబడ్డ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
Joe Biden: అమెరికాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొద్ది క్షణాల పాటు నడిరోడ్డుపై నిల్చోవాల్సి వచ్చింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు, కాన్వాయ్ సుమారు 20 నిమిషాల పాటు స్తంభించిపోవడం కలకలం రేపింది. జో బైడెన్, ఆయన భార్య ప్రయాణిస్తోన్న కారును మరో కారు ఢీ కొట్టడమే దీనికి కారణం.
డెలవార్‌లోని విల్లింగ్టన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:09 నిమిషాలకు ఈ ఘటన సంభవించింది. బైడెన్ కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో ఫోర్డ్ కారొకటి దీన్ని వెంబడించింది. కాన్వాయ్‌లోని కారును ఢీ కొట్టింది. దీన్ని గమనించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు కాన్వాయ్‌ను ఎక్కడికక్కడే నిలిపివేశారు.

తన వాహనం నుంచి జో బైడెన్, జిల్ బైడెన్ కిందికి దిగారు. కొంతసేపు రోడ్డు మీదే నిల్చున్నారు. ఆ వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది వారిని మరో కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనలో బైడెన్ దంపతులకు ఎలాంటి హానీ జరగలేదని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జాన్ పియర్రె ఓ ప్రకటన విడుదల చేశారు. వారిద్దరూ మరో వాహనంలో సురక్షితంగా వైట్ హౌస్‌కు చేరుకున్నట్లు వివరించారు.
ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తోన్నామని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఏజెంట్ స్టీవ్ కొపెక్ చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానిత సంఘటన చోటు సంభవించలేదని, ఈ ప్రాంతం మొత్తం తమ సర్వైలెన్స్‌లో ఉందని అన్నారు.
ఈ ఘటన తరువాత సీక్రెట్ సర్వీస్ సిబ్బంది మెరుపు వేగంతో స్పందించారు. బైడెన్ కారును ఢీ కొట్టిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది క్షణాల్లో చుట్టుముట్టారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విల్లింగ్టన్ ఏరియా మొత్తాన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా అప్రమత్తం అయ్యారు.












Click it and Unblock the Notifications