భారత్‌లో కరోనా మరణాలు మూడు మిలియన్లు?: అధికారిక లెక్కలకు పది రెట్లు అధికంగా
వాషింగ్టన్: భారత్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన్నాయి. ఇదివరకట్లా కొత్త కేసులు గానీ, మరణాలు గానీ నమోదు కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితంగా ఉంటోన్నాయి. డెల్టా వేరియంట్ కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. సెకెండ్ వేవ్‌లో నమోదైన కరోనా మరణాలు ఇప్పుడు చర్చనీయాంశమౌతోన్నాయి. మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించి చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ఈ రకమైన చర్చకు దారి తీసింది. భారత్‌లో కరోనా మరణాలు ఇప్పుడు కేంద్రం చూపిస్తోన్న సంఖ్య కంటే.. కనీసం పది రెట్లు అధికంగా ఉండొచ్చంటూ ఆ కథనం పేర్కొంది. మూడు మిలియన్ల మంచి కరోనా బారిన పడి మరణించి ఉండొచ్చని తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన సందర్భాలు, పరిస్థితులు భారత్‌లో తలెత్తిందని వ్యాఖ్యానించింది.

వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అనే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన పరిశోధనలను తన కథనంలో ఉటంకించింది ది న్యూయార్క్ టైమ్స్. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సమయంలో భారత్‌లో నెలకొన్న సంక్షోభానికి సంబంధించిన డేటా, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు, సీరియాలజిక్ స్టడీస్, ఇంటింటి సర్వే.. వాస్తవ కరోనా మరణాల సంఖ్యను ప్రతిబింబిస్తోన్నాయని, అధికారిక లెక్కల కంటే సుమారు 10 రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య మూడు మిలియన్ల వరకు ఉండొచ్చని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను ఉటంకిస్తూ- కరోనా సెకెండ్ వేవ్ సమయంలో వందలు, వేలల్లో కాదు.. మిలియన్ల సంఖ్యలో ప్రజలు మరణించి ఉంటారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు ప్రతీసారీ పలు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవని తెలిపింది. శ్మశానాల్లోని చితిమంటలు, గంగానదిలో కొట్టుకుని వచ్చిన మృతదేహాలు.. వాస్తవ మరణాల సంఖ్యను భారత ప్రభుత్వం తొక్కిపెట్టిందనే విషయాన్ని స్పష్టం చేశాయని వ్యాఖ్యానించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. భారత్‌లో నాలుగు లక్షలమందికి పైగా మరణించగా.. వాస్తవ సంఖ్య దీనికి పది రెట్లు అధికంగా ఉండొచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications