వివాహ వేదికపై రాకెట్ దాడి: 28 మంది మృతి, 40మందికిపైగా గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమంపై రాకెట్ దాడి జరిగింది ఈ దాడిలో వివాహ బృందానికి చెందిన 28 మంది మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. మరో 40మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులుగా ఉన్నట్లుగా సమాచారం.
ఈ విషాద ఘటన సంగిన్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామమే లక్ష్యంగా మూడు వైపుల నుంచి ఫిరంగులతో దాడి జరిగిందని ఆఫ్ఘనిస్థాన్ 215 కార్ప్స్ ప్రావిన్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ మహమౌద్ తెలిపారు.

తమ దేశ సైనికులు మూడు ఔట్ పోస్టుల నుంచి మోర్టార్ రౌండ్స్ దాడులు జరిపారని తెలిపిన ఆయన, అయితే ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు.
తమ తొమ్మిది మంది పిల్లలు కూడా దాడి జరిగిన తర్వాత కనిపించడం లేదని వరుడి కజిన్ ఒకరు తెలిపారు. కొందరు పిల్లల శరీర భాగాలు చెల్లాచెదురుగా లభించాయని కన్నీటి పర్యాంతమయ్యాడు. అయితే ఆ శరీర భాగాలు తమ పిల్లలవో కాదో తెలియదని అన్నాడు. వివాహ కార్యక్రమానికి వందలాది మంది బంధువులు హాజరయ్యారని చెప్పాడు.












Click it and Unblock the Notifications