Afghanistan: అమెరికా ఆధీనంలో కాబుల్ ఎయిర్‌పోర్ట్: వేలాదిమంది సైనికుల పహారా
కాబుల్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లినప్పటి నుంచీ కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాలిబన్ల అరాచకత్వానికి, ఆటవిక పరిపాలనకు భయపడి.. దేశం విడిచి వెళ్లిపోవడానికి ఆఫ్ఘనిస్తానీయుల అందుబాటులో ఉన్న ఏకైక సాధనం.. విమానాలు మాత్రమే కావడంతో వేలాదిమంది ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్‌లో గడుపుతున్నారు. అందుబాటులో ఉన్న విమానం ఎక్కి, దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తోన్నారు.
విమానాశ్రయానికి వెళ్లే మార్గాలన్నింటినీ ఇప్పటికే మూసివేశారు తాలిబన్లు. ఆయా మార్గాల్లో వందలాది మంది తాలిబన్ ఫైటర్లు తుపాకులతో పహారా కాస్తోన్నారు. స్థానికులను అటువైపు వెళ్లనివ్వట్లేదు. విదేశీయుల తరలింపు ప్రక్రియను అడ్డుకుంటోన్నారు. విమానాల రాకపోకలు సజావుగా సాగనివ్వట్లేదు. ఇందులో భాగంగా ఇదివరకే కమర్షియల్ ఫ్లైట్ల రాకను నిషేధించారు. ఎయిర్ స్పేస్‌ను మూసివేశారు. మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

ఫలితంగా- పౌర విమానాలేవీ ఆఫ్ఘనిస్తాన్ మార్గంలో ప్రయాణించట్లేదు. మిలటరీ విమానాలకు అనుమతి ఉండటం వల్ల విదేశీయుల తరలింపు ప్రక్రియ ఇంకా కాబుల్ ఎయిర్ పోర్ట్ నుంచి కొనసాగుతోంది. ఇందులో మెజారిటీ వాటా అమెరికాదే. ఇప్పటిదాకా 7,000 మందికి పైగా తమ దేశ పౌరులను సురక్షితంగా ఆఫ్ఘనిస్తాన్‌ను దాటించినట్లు అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ విలియమ్ హాంక్ టేలర్ తెలిపారు. విదేశీయుల తరలింపును అడ్డుకుంటోన్న తాలిబన్ల నుంచి ఎయిర్‌పోర్టును తాము స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
Undated video of firing outside the Kabul airport. Taliban usually fires in the air and harasses people for crowd control. Many checkpoints outside the airport by Taliban. pic.twitter.com/nwWwx09Kug
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 19, 2021
ఈ విమానాశ్రయం తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. 5,600 మంది సైనిక బలగాలను ఎయిర్‌పోర్ట్‌లో మోహరింపజేసినట్లు చెప్పారు. అలాగే- తాలిబన్లు అడ్డంకులను సృష్టిస్తోండటం వల్ల ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోలేకపోతోన్న తమదేశ పౌరులకు ఎస్కార్ట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని అన్నారు. ఫ్లైట్ ఆపరేషన్స్, విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. అమెరికన్ల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి ఒక్క అమెరికన్‌ను కూడా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
రెండురోజుల కిందట విమానాశ్రయానికి దారి తీసే మార్గాలన్నింటినీ తాలిబన్లు మూసివేశారు. తమదేశ పౌరులను ఎవరినీ అటు వెళ్లనివ్వట్లేదు. గాలిలో కాల్పులు జరుపుతూ వారిని భయాందోళనలకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి హమీద్ కర్జాయ్ విమానాశ్రయం ఒక్కటే సురక్షిత ప్రదేశం కావడం వల్ల.. అడ్డంకులను దాటుకుని ఆప్ఘనిస్తానీయులు అక్కడికి పరుగులు తీస్తోన్నారు. కనిపించిన విమానాన్ని అందుకుని దేశం దాటి వెళ్లడానికి తాపత్రయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications