అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయంపై ఉగ్రవాద దాడి జరగొచ్చు - అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరిక

కాబుల్‌లోని అమెరికా విమానం

అఫ్గానిస్తాన్‌లోని కాబుల్ విమానాశ్రయానికి ఉగ్రవాద దాడి ముప్పు చాలా ఎక్కువగా ఉందని పలు దేశాలు హెచ్చరించాయి. విమానాశ్రయం దరిదాపుల్లోకి వెళ్లకూడదని తమ దేశ పౌరులకు సూచించాయి.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దేశాల ప్రజలకు ఈ హెచ్చరిక జారీ చేశాయి. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్ట్ బయట ఉన్న వారికి సూచించాయి.

కాబుల్ తాలిబాన్ల వశమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు సుమారు 82వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించారు.

తాలిబాన్లు విధించిన ఆగస్ట్ 31 డెడ్‌లైన్‌లోగా తమ పౌరులను అక్కడినుంచి తరలించేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

వేలాది మంది ప్రజలు విమానాశ్రయం లోపల, బయట అఫ్గాన్ వదిలి వెళ్లేందుకు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చెప్పిన దాని ప్రకారం డెడ్‌లైన్ పొడిగించేందుకు తాలిబాన్లు నిరాకరించారు. కానీ దేశం వదిలి వెళ్లేందుకు విదేశీయులకు, అఫ్గాన్‌ ప్రజలకు ఆగస్ట్ 31 తర్వాత కూడా అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చారు.

'అక్కడ (కాబుల్ విమానాశ్రయం) ఉగ్రవాద దాడి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది' అని గురువారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరిసే అన్నారు.

విమానాశ్రయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ దగ్గర ఎదురుచూస్తున్న ప్రజలందరూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించిన కొన్ని గంటల తర్వాత ఆస్ట్రేలియా ఈ ప్రకటన చేసింది.

బ్రిటన్ కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనే చేసింది. అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాలని, తదుపరి సూచనలు ఇచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలని చెప్పింది.

అఫ్గానిస్తాన్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పటికీ అస్థిరంగానే ఉందని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. 'ఉగ్రవాద దాడి జరిగే ముప్పు ఎక్కువగా ఉంద'ని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, ఏ దేశం కూడా దాడికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.

ఇస్లామిక్ స్టేట్ నుంచి ముప్పు పొంచి ఉన్నందున తాము కాబుల్‌లో చేపడుతున్న తరలింపు ప్రక్రియ త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మంగళవారం చెప్పారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్

గత 24 గంటల్లో అమెరికా సారథ్యంలోని విమానాల్లో 19వేల మందిని తరలించినట్లు నిన్న బ్లింకెన్ చెప్పారు.

ఈ నెల చివరి నాటికి కాబుల్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి తమ ఆపరేషన్లను పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఇలాంటి ఆపరేషన్లను అమెరికా మాత్రమే చేయగలదని బ్లింకెన్ వాషింగ్టన్‌లో చెప్పారు.

డెడ్‌లైన్ ముగిసిన తర్వాత కూడా అఫ్గాన్ వదిలి వెళ్లేందుకు అమెరికన్లకు అవకాశం ఇస్తామని తాలిబాన్లు హామీ ఇచ్చారు. కానీ ఆగస్ట్ 31 తర్వాత మిగతా దేశాల పౌరులు, అఫ్గాన్ ప్రజలకు ఇబ్బందులు రావొచ్చు అని ఆయన అన్నారు.

అయితే, అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి కాబుల్‌లో తమ తరలింపు మిషన్ ముగిసిన తర్వాత కూడా ప్రతిరోజూ సాయం చేస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు.

అఫ్గాన్‌లో ఇప్పటికీ 1500 మంది వరకు అమెరికన్లు ఉండొచ్చని, వారిని ట్రేస్ చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని యూఎస్ విదేశాంగ మంత్రి చెప్పారు.

కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా విమానాల్లో తరలి వెళ్లేందుకు ఇంకా పది వేల మంది ఎదురుచూస్తున్నారని పెంటగాన్ వెల్లడించింది.

దేశం వదిలి వెళ్లాలని వేలాది మంది అఫ్గాన్లకు ఉన్నప్పటికీ వారు కాబుల్‌ విమానాశ్రయం చేరుకోలేకపోతున్నారని తెలిపింది. వారి పట్ల తమకు ఆందోళనగా ఉందని చెప్పింది.

ఎయిర్‌పోర్ట్ గేట్ల దగ్గర తాలిబాన్లు వెనక్కి పంపిస్తున్న అఫ్గాన్ల దగ్గర సరైన ప్రయాణ పత్రాలు ఉన్నట్లు అనిపిస్తోందని బీబీసీ ప్రతినిధి చెప్పారు.

అమెరికన్లను, సాయం చేసిన అఫ్గాన్ ప్రజలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలను తాము తీసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు.

https://twitter.com/JoeBiden/status/1430628555742920704


తరలింపు ప్రక్రియ వేగవంతమైందని బ్రిటన్ వెల్లడించింది. బుధవారం సుమారు 1200 మందిని తరలించామని తెలిపింది.

బ్రిటన్ పౌరులు, అర్హత ఉన్న అఫ్గాన్లను సురక్షితంగా తరలించేందుకు డెడ్‌లైన్‌లోపు అందుబాటులో ఉన్న ప్రతి గంట, ప్రతి రోజును సద్వినియోగం చేసుకుంటామని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ చెప్పారు.

5800 మంది అమెరికా సైనికులు, 1000 మంది బ్రిటన్ సైనికులు కాబుల్ ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం భద్రత కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+