పుతిన్ ఇంటిపై దాడితో భగ్గుమన్న రష్యా-ఏ క్షణమైనా జెలెన్ స్కీపై ప్రతిదాడికి రెడీ...!
ఏడాది క్రితం ఉక్రెయిన్ పై దండయాత్రతో యుద్ధం మొదలుపెట్టిన రష్యా.. ఈ ఏడాది కాలంలో దాన్ని ముగించడంలో మాత్రం విఫలమైంది. దీంతో ఇరుదేశాలకూ తీవ్ర జన, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయినా ఇరుదేశాలూ వెనక్కి తగ్గలేని పరిస్ధితి. ఈ నేపథ్యంలో ఇవాళ రష్యా అధినేత పుతిన్ ఇంటిపై రెండు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా కల్లోలం రేగింది.
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి దిగిందన్న వార్తలతో ఇరుదేశాలూ అప్రమత్తం అయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న రష్యా.. ఇప్పుడు ప్రతిదాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా ప్రతిదాడికి దిగాలని రష్యా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు పుతిన్ పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు వీడియో విడుదల చేసిన తర్వాత రష్యా పార్లమెంట్ ప్రతిదాడిపై ప్రకటన చేసింది.

రష్యా పార్లమెంటు డూమాలో అధికార పార్టీ ఎంపీలు డ్రోన్ దాడికి బాధ్యుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇంటిపై ప్రతి దాడి చేయాలని ప్రతిపాదించారు. కీవ్ లోని జెలెన్ స్కీ నివాసంపై ఈ ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.
దీంతో జెలెన్ స్కీ ఇంటిపై దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. డ్రోన్ దాడిపై ఇప్పటివరకూ స్పందించని ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ప్రతిదాడి చేస్తే ఏం చేయబోతోందన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications