తాలిబన్లకు అల్ ఖైదా కంగ్రాట్స్- కశ్మీర్ సహా ఆ ప్రాంతాలు విముక్తి కల్పించాలని పిలుపు
ఆప్ఘనిస్తాన్ లో ఒకప్పుడు తాలిబన్లతో స్నేహం చేసి దాదాపు రెండు దశాబ్దాల పాటు వారిని తీవ్రవాదులుగా ప్రపంచం దృష్టిలో నిలబెట్టిన ఉగ్రవాద సంస్ధ అల్ ఖైదా ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు వెనుదిరిగిన నేపథ్యంలో ఆ దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న అల్ ఖైదా అంతకు ముందే తాలిబన్లకు శుభాకాంక్షలు తెలిపింది. ఆప్ఘన్ గడ్డను స్వాధీనం చేసుకున్నందుకు వారికి కంగ్రాట్స్ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల విజయానికి కంగ్రాట్స్ చెప్పిన అల్ ఖైదా అంతటితో ఆగకుండా కశ్మీర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకూ విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది. కశ్మీర్ తో పాటు పాలస్తీనా, లెవాంట్, సోమాలియా, యెమన్ కూడా విముక్తి కల్పించాలని తాలిబన్లకు అల్ ఖైదా ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న ముస్లింలకూ విముక్తి కల్పించాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నట్లు వెల్లడించింది.

గతంలో ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికాలో అల్ ఖైదా 9/11 దాడులు చేసింది. అమెరికా విమానాలతోనే వారి దేశంలోని డబ్ల్యూటీసీ టవర్లపై విరుచుకుపడింది. అమెరికాతో పాటు ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యం అల్ ఖైదాపై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో అల్ ఖైదా స్ధావరంగా ఉన్న ఆప్ఘనిస్తాన్ పైనా దాడులకు దిగింది. పర్యవసానంగా తాలిబన్లు అధికారం కోల్పోవడంతో అక్కడ పాశ్చాత్యదేశాల కన్నుసన్నల్లో ఉండే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత భారత్ వంటి దేశాలు కూడా ఆప్ఘనిస్తాన్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు అభినృద్ధి చేశాయి. తిరిగి ఇన్నాళ్లకు తాలిబన్లకు అధికారం దక్కింది.
Recommended Video
ఆప్ఘనిస్తాన్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి అధికారం చేపట్టబోతున్న తాలిబన్లను రెచ్చగొట్టేందుకే అల్ ఖైదా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్దితుల్లో తాలిబన్లు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తాలిబన్ ప్రభుత్వానికీ, ఆయా దేశాలకూ మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అది అల్ ఖైదాకు ఇష్టం లేదు. అలా జరిగితే అల్ ఖైదా ప్రాబల్యం భారీగా తగ్గిపోతుంది. దీంతో అనుకూల పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆప్ఘన్ గడ్డపై అడుగుపెట్టేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications