హసీనాను తక్షణం అప్పగించమన్న బంగ్లా..! భారత్ నిర్ణయం ఇదే..!
గతేడాది బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న తిరుగుబాటు, నిరసనల్ని అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ఇచ్చిన ఆదేశాలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. అప్పట్లో దేశం వదిలి పారిపోయి భారత్ వచ్చేసిన ఆమెపై నేరాల్ని విచారించిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పునిచ్చింది. దీంతో ఆమెను తక్షణం తమకు అప్పగించాలని భారత్ ను బంగ్లాదేశ్ కోరింది. దీనికి విదేశాంగశాఖ స్పందించింది.
భారత్ తమతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను వెంటనే అప్పగించాలని బంగ్లాదేశ్ ఇవాళ కోరింది. ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పు వెలువడగానే భారత్ తో సంప్రదింపులు ప్రారంభించిన బంగ్లాదేశ్ విదేశాంగశాఖ కీలక విజ్ఞప్తి చేసింది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ దీనికి బాధ్యత వహించాలని కోరింది. గతేడాది జూలై హత్యలతో ముడిపడి ఉన్న మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మాజీ ప్రధానిని దోషిగా తేల్చినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఆమెకు ఆశ్రయం కల్పించే ఏ దేశమైనా న్యాయం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లేనని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ హెచ్చరించింది.
కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే హసీనాతో పాటు ఆమె కుమారుడిని బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించాలని కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందం ప్రకారం ఈ అప్పగింతను "తప్పనిసరి విధి" అని పేర్కొంది. ఆరోపణల తీవ్రత, ట్రిబ్యునల్ తీర్పులను బట్టి, భారత్ తన చట్టపరమైన కట్టుబాట్లను గౌరవిస్తుందని బంగ్లాదేశ్ ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే భారత్ స్పందించింది. ఇవాళ షేక్ హసీనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును గమనించినట్లు తెలిపింది. సమీప పొరుగు దేశంగా భారతదేశం శాంతి, ప్రజాస్వామ్యం, చేరిక , స్థిరత్వంతో సహా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగ్లాదేశ్‌లోని అందరు భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని మాత్రమే తెలిపింది. అయితే ఈ ప్రకటనలో నేరస్థుల అప్పగింత డిమాండ్‌ను నేరుగా ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications