H-1B షాకులతో అమెరికా వెళ్లేందుకు మిగిలిన రెండు దారులివే..! అర్హతలివే..!
అమెరికాలోకి వలసల్ని నియంత్రించేందుకు, స్వదేశీయులకు ఉద్యోగాల కల్పన కోసం ట్రంప్ సర్కార్.. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను మరోసారి కఠినతరం చేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ టెక్ కంపెనీలకు ఇచ్చే శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పై ఆంక్షలు విధించింది. ఈ పరిణామాలు ఐటీ రంగంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీన్ని సమర్ధించుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బీ దుర్వినియోగంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలతో గ్రీన్ కార్డులు దొరక్కపోతే భారతీయులకు మిగిలి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ మొదలైంది.
హెచ్1బీకి ప్రత్యామ్నాయాలు (H-1B)
తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు హెచ్ 1 వీసాలకు ప్రత్యామ్నాయంగా అమెరికాలో ఎల్ -1, ఓ-1 వీసాలు ఉపయోగపడబోతున్నాయి. అయితే ఈ రెండు వీసాలు అమెరికాలో ఉపాధి పొందేందుకు వీలు కల్పిస్తున్నప్పటికీ, వీటి అర్హత ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. సాధారణ ఉద్యోగులందరికీ ఇవి వర్తించవు. బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే మేనేజర్లు, కీలక విధుల్లోని నిపుణులు ఎల్-1 వీసా ద్వారా బదిలీ అయ్యే వీలుంది. అలాగే సైన్స్, విద్య, కళలు లేదా వ్యాపార రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన నిపుణులకు ఓ-1 వీసాలు ఉపయోగపడతాయి.

ఎల్-1, ఓ-1 వీసాల మధ్య తేడాలు
ఎల్-1 వీసా అనేది ఒకే కంపెనీ వివిధ దేశాల్లో ఉన్న కార్యాలయాల మధ్య ఉద్యోగులను బదిలీ చేసేందుకు వాడుకునే ఓ అవకాశం. ఇందులో మేనేజర్ల విభాగం కోసం ఎల్-1ఏ, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల బదిలీల కోసం ఎల్-1బీ కేటగిరీలు ఉంటాయి. కానీ ఓ-1 వీసా దీనికి విరుద్ధంగా ఉంటుంది. దీనికి కంపెనీ అంతర్గత బదిలీతో సంబంధం లేదు. దరఖాస్తుదారుని వ్యక్తిగత అసాధారణ సాధనలు, విజయాలు, లభించిన గుర్తింపుల ఆధారంగా ఈ ఓ-1 వీసాను మంజూరు చేస్తారు.
హెచ్-1బీ వీసాకు ఇవి ప్రత్యామ్నాయాలేనా?
హెచ్-1బీ దొరకని వారికి ఇవి తక్షణ ప్రత్యామ్నాయాలుగా భావిస్తున్నప్పటికీ.. ప్రతి ఒక్కరికీ ఇవి సాధ్యపడవని వీసా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎల్-1, ఓ-1 మార్గాలు చాలా పరిమిత పరిధిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఓ-1 అర్హత ప్రమాణాలు అత్యంత కఠినంగా ఉంటాయని, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ చూపిన కొద్దిమందికి మాత్రమే ఈ వీసా సాధ్యమవుతుందని చెప్తున్నారు. అందువల్ల అమెరికా వెళ్లాలనుకునే భారతీయ నిపుణులు కేవలం వీసా లభ్యత ఆధారంగా కాకుండా ఉద్యోగ స్వభావం, కల్పించే వేతనాలు, అమెరికాలో జీవన వ్యయం, తమ కెరీర్ ప్రణాళికలు వంటి పలు కోణాలను ముందే విశ్లేషించుకోవాలి. కేవలం వీసా మార్పిడిలా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేయాలని, ఇమ్మిగ్రేషన్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.















Click it and Unblock the Notifications
