ఆప్ఘనిస్తాన్ పై పెరుగుతున్న తాలిబన్ల పట్టు-భారతీయుల్ని వెనక్కి రప్పిస్తున్న కేంద్రం
ఆప్ఘనిస్తాన్ లో భారతీయుల భద్రతకు ముప్పు పెరుగుతోంది. తాజాగా అమెరికా బలగాల ఉపసంహరణ, పెరుగుతున్న తాలిబన్ల పట్టు నేపథ్యంలో భారతీయుల భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్ని క్రమంగా వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికాలో జో బైడన్ అధికారంలోకి వచ్చాక ఆప్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా అమెరికా బలగాలను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గతంలో అమెరికాపై అల్ ఖైదా జరిపిన 9/11 దాడుల తర్వాత ఆప్ఘన్ లో తిష్టవేసిన యూఎస్ బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టాయి. అదే సమయంలో అప్పటివరకూ మూలనపడిన తాలిబన్లు తిరిగి ఆప్ఘనిస్తాన్ లో పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి.

అమెరికా బలగాల ఉపసంహరణతో ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం వర్సెస్ తాలిబన్లుగా అక్కడ పోరు మారిపోయింది. దీంతో ఆప్ఘన్ సైన్యంపై విరుచుకుపడుతున్న తాలిబన్లు తిరిగి పునర్ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు భారతీయుల్ని అపహరించే ప్రమాదం ఉందని నిఘా వర్గాల నుంచి భారత ఎంబసీకి సమాచారం వచ్చింది. అదే సమయంలో ఆప్ఘన్ లో విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం లభించింది. దీంతో భారత్ సహా పలు దేశాలు ఆప్ఘన్ లో ఉన్న తమ పౌరుల్ని వెనక్కి రప్పించే పనిలో పడ్డాయి.












Click it and Unblock the Notifications