అమెరికా-చైనా మధ్య ముదురుతోన్న ట్రేడ్ వార్: ట్రంప్ తోక కత్తిరించిన డ్రాగన్ కంట్రీ..!!
US-China Trade War:అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై విధించిన 104% సుంకాలను ఎదుర్కొంటూ,బీజింగ్ బుధవారం అమెరికా వస్తువులపై భారీ ప్రతీకార చర్యలు చేపట్టింది. చైనా ప్రభుత్వం అమెరికన్ వస్తువులపై అదనంగా 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది గతంలో విధించిన 34% సుంకంతో పోలిస్తే రెండింతలు ఎక్కువ. ఈ నిర్ణయం ఏప్రిల్ 10వ తేదీ నుండి అమలులోకి వస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
చైనా ప్రకటనతో కుప్ప కూలిన అమెరికా స్టాక్స్
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం,చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. 12 అమెరికన్ సంస్థలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చడంతోపాటు, 6 అమెరికాకు చెందిన సంస్థలను జాబితా నుంచి తొలగించింది. ఈ చర్యలు అమెరికా కంపెనీలకు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.చైనా ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. స్టాక్ సూచిక ఫ్యూచర్స్ ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.

ట్రంప్‌కు డ్రాగన్ షాక్
ట్రంప్ ప్రభుత్వం చైనాపై 104% సుంకాలు విధించిన మరుసటి రోజే చైనా ఈ ప్రతీకార చర్యలు తీసుకుంది.ట్రంప్ విధించిన సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ బుధవారం నుండి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.చైనా గతంలో విధించిన సుంకాలను ట్రంప్ తప్పుబట్టారు. చైనా ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నానని, ఆ తర్వాత 100% మించిన సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు.ట్రంప్ ప్రభుత్వం భారీ సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే, చైనా ఏప్రిల్ 10వ తేదీ నుండి అమెరికా వస్తువులపై 34% సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు వంటి ఆధునిక సాంకేతిక ఉత్పత్తులలో ఉపయోగించే రేర్ ఎర్త్ మూలకాల ఎగుమతులను కూడా నియంత్రిస్తామని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.
ఈ చర్యలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.చట్ట ప్రకారం ఎగుమతి నియంత్రణలను అమలు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం జాతీయ భద్రత, ప్రయోజనాలను పరిరక్షించడం అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడమే అని తెలిపింది.చైనా విధించిన 34% సుంకాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చైనా ఈ నిర్ణయం తీసుకుని చాలా పెద్ద తప్పు చేసిందని ట్రంప్ అన్నారు.చైనా మోసపూరితంగా వ్యవహరించిందని ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
చైనా పంపిన సంకేతాలేంటి..?
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా, చైనా సుంకాన్ని మరింత పెంచడం ద్వారా (34% నుండి 84%కి) ట్రంప్ సుంకాలపై చివరి వరకు పోరాడతామనే సంకేతాన్ని పంపింది.అమెరికాకు ఎగుమతులపై 104% పన్ను అమలులోకి రావడంతో,రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతుల్యంగా ఉందని చైనా వాదించింది.జిన్‌పింగ్ ప్రభుత్వం, ఇతర దేశాలు చేస్తున్నట్లుగా, వైట్ హౌస్‌తో చర్చలు జరుపుతుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
అమెరికా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను మరింత పెంచాలని చూస్తే, చైనా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని,చివరి వరకు పోరాడేందుకు తమకు దృఢ సంకల్పం, తగినంత వనరులు ఉన్నాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.ట్రంప్ 104శాతం సుంకాలు విధించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాలను పూర్తిగా తగ్గించేందుకు తమ వద్ద తగిన విధానాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా,2025లో చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పరిణామాల నేథ్యంలో, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications