యూఎస్ లో కరోనా టెర్రర్ ... 24 గంటల్లో రెండు లక్షల కేసులతో విజృంభణ
యూఎస్ లో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు లక్షకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితులు అమెరికా వాసులకు టెర్రర్ పుట్టిస్తున్నాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సంకలనం చేసిన లెక్కల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ మంగళవారం కొత్త కోవిడ్ -19 కేసులు మునుపటి రికార్డును అధిగమించింది. 24 గంటల్లో 2,01,961 కేసులను నమోదు చేయడంతో ఇప్పుడు అమెరికా వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముందు ముందు ఈ పరిస్థితులు మరింత దిగజారితే ఎలా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

యూఎస్ లో 24 గంటల వ్యవధిలో 1,535 మరణాలు
ఈ వారం డేటా ప్రకారం ఇప్పటివరకు యూఎస్ లో మొత్తం కేసులు 1,02,38,243 కు చేరుకున్నాయి, మొత్తం 239,588 మరణాలతో అమెరికా కరోనా కేసులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది . కరోనా కారణంగా యూఎస్ తీవ్రంగా దెబ్బతింది. 24 గంటల వ్యవధిలో, కోవిడ్ -19 నుండి 1,535 మరణాలు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా తెగ కష్టపడుతోంది.
కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ప్రకారం, దేశవ్యాప్తంగా 60,000 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.

టీకా కోసం ఎదురు చూపు .. వ్యాక్సిన్ టెస్టింగ్ లో వేగం
నవంబర్ 3 ఎన్నికలలో ఓటమిని అంగీకరించడానికి నిరాకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వైరస్ దానంతటదే పోతుందని పేర్కొన్నారు. కానీ ప్రత్యర్థి జో బైడెన్ కరోనా కట్టడి కోసం మరింత చురుకైన విధానాన్ని తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసాడు. ఫేస్ కవరింగ్ వైరస్ అదుపులోకి తీసుకురావడానికి ఉత్తమమైన మార్గం అని చెప్పాడు జో బైడెన్ .
ఇదే సమయం లో కరోనా వ్యాక్సిన్ కోసం యూఎస్ ఎదురుచూస్తోంది. యుఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్ మరియు దాని జర్మన్ భాగస్వామి బయోఎంటెక్ సోమవారం తమ టీకా అభ్యర్థి కోవిడ్ -19 ను నివారించడంలో 90 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది వ్యాక్సిన్ కోసం దేశం ఎదురు చూసిన క్షణంలో పెద్ద పురోగతిగా చెప్పొచ్చు.
Recommended Video

శీతాకాలంలో కరోనా పంజా .. ముందే చెప్పిన వైద్య నిపుణులు
చలికాలం కరోనా తీవ్రత పెరుగుతుందని ముందే వైద్య నిపుణులు అంచనా వేశారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు . మాస్కులు ధరించటం , సామాజిక దూరం పాటించటం అనివార్యం అని చెప్తున్నారు . మరోవైపు పెరుగుతున్న కేసులతో యూఎస్ లో ఏర్పడే కొత్త సర్కార్ ముందు పెద్ద టాస్క్ ఉంది . కరోనా కట్టడి చెయ్యటంలో విఫలం చెందటం కూడా ట్రంప్ పరాజయానికి కారణం అని తెలుస్తుంది . ఈ నేపధ్యంలో జో బైడెన్ కరోనా కంట్రోల్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications