చక్రం తిప్పిన డొనాల్డ్ ట్రంప్.. !!
అమెరికా సైనికచర్య అనంతరం వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం, ఆయనను న్యూయార్క్ తరలించడంతో అక్కడి ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించాయి. వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు వెనిజులా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా దళాల ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్న అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని సమయంలో, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని సూచించింది. పరిపాలన నిరంతరాయంగా సాగేలా చూడటానికి, దేశ సమగ్ర రక్షణకు భరోసా ఇవ్వడానికి బోలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అధ్యక్ష పదవిని రోడ్రిగెజ్ చేపట్టనున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

అధ్యక్షుడి బలవంతపు గైర్హాజరీలో దేశ, ప్రభుత్వ పరిపాలన, సార్వభౌమత్వాన్ని రక్షించడానికి వర్తించే చట్టపరమైన నిబంధనలను నిర్ధారించడానికి త్వరలో చర్చించనున్నట్లు తీర్పు పేర్కొంది. పాలన సజావుగా కొనసాగడానికి, రక్షణపరమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో వెనిజులా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైనట్టయింది.
ఇప్పటికే డెల్సీ రోడ్రిగేజ్ సోదరుడు జార్జ్ రోడ్రిగేజ్.. వెనిజులా నేషనల్ అసెంబ్లీ చీఫ్ గా వ్యవహరిస్తోన్నారు. పరిపాలన, రాజకీయ పరమైన బాధ్యతలను వీరిద్దరూ పంచుకునే అవకాశం ఉంది. నికొలస్ మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా డెల్సీ రోడ్రిగెజ్ కు పేరుంది. సోషలిస్ట్ ప్రభుత్వానికి రక్షణగా నిలిచినందు వల్ల గతంలో ఆమెను మదురో లేడీ టైగర్ గా అభివర్ణించారు.
కారకాస్ కు చెందిన డెల్సీ వయస్సు 56 సంవత్సరాలు. 1969 మే 18వ తేదీన జన్మించారు. 1970లలో విప్లవాత్మక లిగా సోషలిస్టా పార్టీని స్థాపించిన వామపక్ష గెరిల్లా యోధుడు జార్జ్ ఆంటోనియో రోడ్రిగెజ్ కుమార్తె ఆమె. రోడ్రిగెజ్ ఉపాధ్యక్ష పదవితో పాటు ఆర్థిక, చమురు మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. బలహీనపడిన ప్రైవేటు రంగాన్ని పరుగులు పెట్టించారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ఆమె సంప్రదాయ ఆర్థిక విధానాలను అమలు చేశారు.
2013-2014 మధ్య కమ్యూనికేషన్, సమాచార శాఖ, 2014 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2018 జూన్ లో ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. డిజైనర్ ఫ్యాషన్లు అంటే ఆమెకు చాలా ఇష్టం.












Click it and Unblock the Notifications