రహస్య పత్రాల ఉచ్చులో ట్రంప్-తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా చెత్త రికార్డు..
అమెరికా అధ్యక్షుడిగా గతంలో ఓ వెలుగు వెలిగిన డొనాల్డ్ ట్రంప్ కు పదవి నుంచి తప్పుకున్నాక చుక్కలు కనిపిస్తున్నాయి. మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో ఆయన గతంలో చేసిన తప్పిదం ఒకటి ఆయన్ను వెంటాడుతోంది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక కూడా అధికారిక రహస్య పత్రాల్ని తన వద్దే ఉంచుకున్న నేరంపై ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి.
రహస్య పత్రాల వివాదంలో చిక్కుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుల చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఎవరూ ఇలా అధికారిక రహస్య పత్రాల్ని తన వద్ద ఉంచుకుని అభియోగాలకు గురైన రికార్డు లేదు. దీంతో ఇప్పుడు ట్రంప్ పై నమోదైన అభియోగాలతో ఈ చెత్త రికార్డు నమోదవుతోంది. అయితే ఇదంతా బైడెన్ సర్కార్ కుట్ర అంటూ తప్పించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తనపై రహస్య పత్రాల అభియోగాలు మోపారని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. అసలే వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఆయన అవకాశాల్ని దారుణంగా దెబ్బతీసింది. అవినీతిలో కూరుకున్న బైడెన్ ప్రభుత్వం తనపై అభియోగాలు మోపినట్లు తన లాయర్లకు వెల్లడించినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనకు సంబంధించి న్యాయ శాఖ నుండి ఎలాంటి నిర్ధారణా రాలేదు.
గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తనవద్ద ఉంచుకోవడం, తప్పుడు ప్రకటనలు చేయడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం, కుట్రల వంటి ఏడు ఆరోపణలపై తన క్లయింట్(ట్రంప్)పై అభియోగాలు మోపినట్లు ఆయన లాయర్ న్యాయవాది జిమ్ ట్రస్టీ వెల్లడిచారు. అభియోగాల ఖచ్చితమైన వివరాలు వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. అయితే కుట్ర అభియోగం, న్యాయానికి ఆటంకం కలిగించడానికి సంబంధించినదిగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications