5 లక్షల వలసదారుల బహిష్కరణ-ట్రంప్ సంచలన ఆదేశాలు..!
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసలపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ప్రక్రియను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున వలసదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వలసల్ని సక్రమమా, అక్రమమా అన్న తేడా లేకుండా ముందు గుర్తింపు కోసం భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో అక్రమంగా వలస వచ్చిన వారిని వెంటనే బహిష్కరిస్తుండగా.. సక్రమమని తేలిన వారిపైనా నిఘా పెంచుతున్నారు.
ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఏకంగా 5.32 లక్షల మంది వలసదారులకు గతంలో ఇచ్చిన తాత్కాలిక హోదాను రద్దు చేసేసింది. అక్రమ వలసదారుల గుర్తింపులో భాగంగా ఇలా గతంలో తాత్కాలిక వలసదారులుగా వీరు పొందిన హోదాను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు వీరిని నెల రోజుల్లోగా వారి స్వదేశాలకు పంపేయబోతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్ ప్రభుత్వం తాజాగా తాత్కాలిక వలసదారుల హోదా రద్దు చేసిన వారిలో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ ఇన్నాళ్లూ ఉన్న తాత్కాలిక వలసదారుల హోదా రద్దు కావడంతో దశల వారీగా నెల రోజుల్లో వారి స్వదేశాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరంతా 2022 తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారిగా ప్రభుత్వం చెబుతోంది. బైడెన్ హయాంలో వీరికి ఈ హోదా కేటాయించారు.
ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డు దారులు, హెచ్1బీ వీసా దారులపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇలా తాత్కాలిక వలసదారుల్ని లక్ష్యంగా చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఏకంగా 5.32 లక్షల మందికి తాత్కాలిక వలసదారుల హోదా రద్దు చేయడం ద్వారా ట్రంప్ పెనుసంచలనం రేపారు.












Click it and Unblock the Notifications