సైనిక విమానాల్లోనే వలసల తరలింపు ఎందుకు ?-ఒక్కొక్కరిపై 4 లక్షలు-ట్రంప్ మెసేజ్ ఇదే.. !
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసలను వారి స్వదేశాలకు పంపేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే ప్రారంభమైన వలసల తరలింపు చురుగ్గా కొనసాగుతోంది. ఇవాళ భారతీయ వలసలతో కూడిన సీ 17 మిలటరీ విమానం ఒకటి అమృత్ సర్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ఇలా సైనిక విమానాల్లో వలసల్ని ఎందుకు తరలిస్తోంది, వీటితో పాటు కమర్షియల్ విమానాల్ని కూడా ఎందుకు వాడుతోందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది.
అయితే దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని భావించిన ట్రంప్.. వివిధ దేశాల నుంచి వచ్చి తమ దేశంలో పాగా వేసిన వారిని బహిష్కరిస్తున్నారు. అయితే ఈ బహిష్కరణలు అవమానవీయంగా ఉంటే ఆ తర్వాత ఆయా దేశాలన్నీ తమకు శత్రువులుగా మారడం ఖాయం. అందుకే ట్రంప్ ఇలా సైనిక విమానాల్లో ఎక్కించి మరీ వీరిని స్వదేశాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా తాము యుద్ధాలకు వాడే విమానాల్లో గౌరవ ప్రదంగానే మీ వారిని మీ దేశానికి పంపినట్లు సందేశం ఇస్తున్నారట.

అలాగే కమర్షియల్ విమానాల్లో సైతం పలు దేశాల వలసల్ని వారి దేశాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో వలసదారుపై 4 లక్షల వరకూ ట్రంప్ సర్కార్ ఖర్చుపెడుతోందట. దీన్ని బట్టి చూస్తే ఎంత ఖర్చయినా ఫర్వాలేదు వలసలు మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అన్న ధోరణి ట్రంప్ లో కనిపిస్తోంది. అంతే కాదు ఆయా దేశాలకు సైతం ఇంత భారీగా ఖర్చుపెట్టి మీ వారిని మీ దేశాలకు పంపామన్న సందేశం ఇచ్చేందుకే ట్రంప్ ఇలా సైనిక, వాణిజ్య విమానాల్లో వలసల్ని పంపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications