మరో ఫ్లైట్ రెడీ చేసిన ట్రంప్-ఈసారి 487 భారతీయులు..!
అమెరికాలో అక్రమ వలసలపై కొరడా ఝళిపిస్తున్న ట్రంప్ సర్కార్ భారత్ కు వరుస షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే 104 మంది అక్రమ వలసదారుల్ని భారత్ కు పంపేసిన ట్రంప్.. ఇప్పుడు వచ్చే వారం ప్రధాని మోడీ వచ్చి తనతో భేటీ అయ్యే లోపే మరో దఫా వలసల తరలింపుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చారు. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాలకు ఈ మేరకు సమాచారాలు పంపుతోంది.

అమెరికాలో అక్రమంగా పాగా వేసిన మరో 487 వలసదారుల్ని స్వదేశానికి తరలించేందుకు అక్కడి ప్రభుత్వం తుది ఉత్తర్వులు ఇచ్చిందని ఇవాళ కేంద్రం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఓ ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో తొలిసారి భారతీయ వలసలతో బయలుదేరిన విమానం తాజాగా అమృత్ సర్ లో దిగింది. అయితే ఇలా పంపిన వలసదారులు సంకెళ్లతో ఉండటం కేంద్రానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈసారి కేంద్రం ముందే వలసల రాకపై ప్రకటన చేసింది. అలాగే ఈ వలసల రాకపై రాష్ట్రాలకు కూడా సమాచారం పంపుతోంది.
అమెరికా చట్టాల ప్రకారం ఎంత మందిని బహిష్కరిస్తున్నారు, ఉల్లంఘనలు ఏంటన్న దానిపై తమకు సమాచారం ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇవాళ వెల్లడించారు. భారతీయులను బహిష్కరించడానికి US సైనిక విమానాలను ఉపయోగించడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఇది జాతీయ భద్రతా చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు అమెరికా నుంచి భారతీయ వలసల్ని అవమానవీయంగా తరలించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాత్రం నిన్న రాజ్యసభలో ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. విదేశాలలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేలితే ప్రతి దేశానికీ తమ దేశస్థులను వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వాదించారు.












Click it and Unblock the Notifications